Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ లాక్డౌన్ తర్వాత సినిమాలు చేసే విషయంలో మన కథానాయకులు వేగాన్ని పెంచారు. ఓ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకి పచ్చ జెండా ఊపేస్తున్నారు. అవకాశం ఉంటే ఒక సినిమాకే కాదు రెండు, మూడు సినిమాలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇందులో భాగంగా అగ్ర కథానాయకుడు బాలకృష్ణ సైతం ఓ కొత్త సినిమాకి సైన్ చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
గతంలో బాలకృష్ణతో 'డిక్టేటర్' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీవాస్ దర్శకత్వంలోనే బాలయ్య కొత్త సినిమాని చేయబోతున్నారు. రచయిత కోనవెంకట్, శ్రీవాస్ ఇద్దరూ కలిసి తయారు చేసిన కథ బాలయ్యకి విపరీతంగా నచ్చిందట. దీంతో ఈ సినిమా సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కబోతోందని కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ఇదిలా ఉంటే, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఏకధాటిగా జరుగుతోంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో రూపొంది 'లెజెండ్', 'సింహ' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. దీంతో ఈ కాంబోలో రూపొందుతున్న ఈ మూడో సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.