Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి' తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కథానాయకుడు ప్రభాస్ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్ని ఆ రేంజ్‌కి తగ్గట్టుగానే పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.
లేటెస్ట్గా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ పాన్ ఇండియా సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగల్ ఇచ్చారు. అలాగే వీరి కాంబినేషన్లో రూపొందబోయే సినిమా టైటిల్‌తోపాటు ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ని కూడా ఇటీవల చిత్ర బృందం రిలీజ్ చేసింది. 'సలార్' టైటిల్ పోస్టర్లో అత్యాధునిక ఆయుధాలతో ప్రభాస్ ఉన్న తీరు అందరినీ సర్ప్రైజ్ చేసింది. అలాగే 'సలార్' టైటిల్‌కి అర్థం ఏంటనే మీమాంసలోనూ అందరూ ఉన్నారు. అలాగే ఇలాంటి టైటిల్ ఉన్న సినిమాకి ప్రభాస్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంచుకోవడానికి కారణమేంటనే సందేహం కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది. వీటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు.
'ఉగ్రం', 'కేజీఎఫ్' చిత్రాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నా కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, పేరు సొంతం చేసుకున్నాను. కన్నడలో ఉన్న హీరోలను కాకుండా తెలుగు చిత్ర సీమకి చెందిన రెబల్‌స్టార్ ప్రభాస్‌ని ఎందుకు తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారు. నేను రాసుకున్న 'సలార్' కథకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని పించింది. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నా. అలాగే 'సలార్' టైటిల్‌కు అందరూ ఎన్నో రకాల అర్థాలు చెబుతున్నారు. అది ఒక సామాన్యమైన పదం. ఉర్దూలో 'సలార్' అంటే సమర్థవంతమైన నాయకుడు అని అర్థం. రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఓ వైలెంట్ పాత్రను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అమాయకంగా ఉండే వ్యక్తి, కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడో నా సినిమాలో చూపించబోతున్నా. అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్. అందుకే ప్రభాస్‌ని హీరోగా ఎంపిక చేసుకున్నా' అని దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరణ ఇచ్చారు.