Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లమల..ఈ పేరు వినగానే ఎన్నో గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న చిత్రం 'నల్లమల'. నల్లమల చుట్టూ ఉన్న ఎన్నో చీకటి కోణాలను స్పశిస్తూ, అక్కడి వారి జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అనేక మంది మోసాలను బట్టబయలు చేస్తూ తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటివరకు ఇలాంటి కథాంశంతో తెలుగులో సినిమా రాలేదనే చెప్పాలి. కథే హీరోగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి మొదటి వీడియో సాంగ్ ప్రముఖ నటుడు నాజర్ చేతుల మీదుగా విడుదలైంది. 'ఎరుపెక్కే గ్రహణమిది రవికెరుగని గగనం..ఎదురొచ్చే శకలాలను పెకలించే పర్వం..నిజాల చాటు నీలి నీడని..సవాలు చేసే సమిధలం అనీ..' అంటూ అత్యంత శక్తివంతంగా ఉన్న ఈ పాటకు పెద్దపల్లి రోహిత్ సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ, 'పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించిన ఫీలింగ్ వచ్చింది. గొప్ప కథతో రూపొందుతున్న చిత్రమిది. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని అన్నారు. 'ఈ పాటలోని సాహిత్య విలువలు చూస్తేనే సినిమా రేంజ్ తెలిసిపోతుందని చెప్పొచ్చు. విన్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన పాట అని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : శివ సర్వాణి, ఫైట్స్ : నబా, విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్, ఆర్ట్ : యాదగిరి, సినిమాటోగ్రఫీ : వేణు మురళి, సంగీతం, పాటలు : పి.ఆర్, నిర్మాత : ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్.