అగ్ర కథానాయకుడు ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కబ్జా'. మన దేశంలోనే 7 వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఉపేంద్ర - చంద్రు కాంబినేషన్లో 'బ్రహ్మ', 'ఐ లవ్ యూ' సినిమాలొచ్చాయి. వీళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రమిది. సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద ప్రకటన ఉంది అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ లో, '?' అని రాసి, ఎవరు జాయిన్ కాబోతున్నారో కనుగొనండి అని ఉంది. అందులో ఉన్నది చిత్ర కథానాయకుడు ఉపేంద్ర అనేది స్పష్టంగా తెలియగా, సినిమాలో కథానాయిక అనుకుంటూ ఆ తరువాత మల్టీస్టారర్ చిత్రాల పోస్టర్లు కలగలిపిన పోస్టర్లను రిలీజ్ చేశారు. వీటన్నింటికి తెర తీస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ '?' అనేది 'కన్నడ' బాద్షా కిచ్చా సుదీప్ అని తెలియజేస్తూ ఓ లుక్‌ని విడుదల చేశారు. అందులో 'భార్గవ్ భక్షి' 1947-1986 అని ఉండగా, ఆ పాత్ర సుదీప్ పోషించబోతున్నారు అని కనిపిస్తోంది. మాఫియాని అంతం చేసే ఒక పాత్ర అని పోస్టర్ మీద రాసి ఇంకాస్త ఆసక్తిని పెంచింది చిత్ర టీమ్. గతంలో ఉపేంద్ర- సుదీప్ కాంబినేషన్లో 'ఓ మై గాడ్' హిందీ సినిమాని కన్నడలో రీమేక్ చేశారు. దానికి పూర్తి వైవిధ్యమైన సినిమాగా ఈ సినిమా కనిపిస్తోందని పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్‌లో మరోసారి రాబోతున్న పాన్ ఇండియా సినిమా 'కబ్జా' ఎలా ఉండబోతోందో, రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందేదని అంటోంది చిత్ర యూనిట్.