Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్లో ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌పై గ్జేవియర్ బ్రిట్టో నిర్మించిన చిత్రం 'మాస్టర్'. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13న ఈ సినిమాను తెలుగులో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు విడుదల చేశారు. 'విజిల్' వంటి సూపర్‌హిట్ తర్వాత ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమా సైతం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ, 'ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'మాస్టర్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమా హీరో విజయ్ కెరీర్లోనే బెస్ట్ కలెక్షన్స్‌ను రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒకటి, రెండు ఏరియాలు మినహా అన్ని ఏరియాల్లో బయ్యర్లు బ్రేక్ ఈవెన్‌తో ప్రాఫిట్స్ జోన్లోకి ఎంటర్ అయ్యారు. ఈ రెండు రోజుల్లో మిగిలిన ఏరియాల బయ్యర్లకు కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం కలిగించిన విజయ్ కి, నిర్మాతలు బ్రిట్టో, లలిత్, జగదీష్‌కి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసిన దిల్‌రాజుకి, ఆంధ్ర ఏరియాను కోనుగోలు చేసిన రాజేశ్‌కి, సీడెడ్‌లో విడుదల చేసిన కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్స్ వారికి ధన్యవాదాలు. ఆంధ్రాలో కూడా వైజాగ్‌ను దిల్‌రాజు, ఈస్ట్ భరత్ చౌదరి, వెస్ట్ ఉషా పిక్చర్స్, కష్ణా రాజేశ్, గుంటూరు పద్మాకర్ సినిమాస్, నెల్లూరు డాక్టర్ పవన్‌కుమార్ అందరూ అద్భుతమైన రిలీజ్‌ను ఇచ్చారు. విజయ్ 'విజిల్' తర్వాత తెలుగులో మేం విడుదల చేసిన రెండో సినిమా ఇది. 'విజిల్' ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి మరో హిట్‌ని దక్కించుకున్నాం. త్వరలోనే విజయ్ తో మరో సినిమా చేసే అవకాశం వస్తుందనే నమ్మకంగా ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న రెస్పాన్స్‌కు విజయ్ చాలా హ్యాపీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ శ్రీనుగారు క్రాక్ థియేటర్స్‌ను నైజాం నుండి ఈ సినిమా కోసం తీసేసుకున్నామంటూ మాట్లాడారు. సమస్య గురించి మాట్లాడాలి కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు. 'మాస్టర్' తమిళ సినిమానే అయినా, డబ్బులు మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కే కదా వచ్చింది. అన్ని సినిమాలు బాగా ఆడుతున్న సమయంలో ఇలా కాంట్రవర్సీ మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను' అని చెప్పారు.