Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి అందరూ ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ గురించి ఎట్టకేలకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖని, హాలీవుడ్ స్టార్ అలిసన్ డూడీ సహా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్నారు. ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించారనేదే కథాంశం. విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ, 'మా సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మిగిలిన కార్యక్రమాలను వీలైనంత తర్వగా పూర్తి చేసి, సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది దసరాను ప్రేక్షకాభిమానులు థియేటర్స్‌లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు' అని చెప్పారు.