Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి తారకరత్న హీరోగా, వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో సంగీత దర్శకుడు కోటి నటించిన చిత్రం 'దేవినేని'. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. 'బెజవాడ సింహం' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్ర ప్రమోషల్ సాంగ్‌ను ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ చేతుల మీదుగా ఈ చిత్ర ప్రమోషల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మంచి కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకుని తీసిన ఈ సినిమా తెలుగు ప్రజలందరికీ తప్పక నచ్చుతుంది. ట్రైలర్లు చాలా బాగున్నాయి' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు నర్రా శివ నాగు మాట్లాడుతూ,'ఈ సినిమా బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి మీద అభిమానంతోనే ఈ సినిమా చేశా. మహాభారతంలో పాండవులు, కౌరవులు మధ్య చిన్న గొడవ జరిగి, విడిపోవడం వల్లే మహాభారతం పుట్టి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ కౌరవులు, పాండవులను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ ఇద్దరు మహానాయకుల కథ రాసుకున్నాను. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇద్దరి ఫ్యామిలీలలో ఎవరిని తక్కువ చేయకుండా,ఇద్దరినీ సమానంగా చూపించాం. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు. ఈ చిత్ర నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదు. చిన్న నిర్మాతలైనా ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారు' అని చెప్పారు. చిత్ర నిర్మాత రాము రాథోడ్ మాట్లాడుతూ,'వంగవీటి రంగా అభిమానులను, దేవినేని అభిమానులను ఎక్కడ నిరుత్సాహపరచదు. వారందరూ ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.