Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గాలోడు'. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించింది. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు.
'ఈ చిత్ర కథ నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. అయితే ఇది కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను. కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్ చెప్పేవారు. సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి. మంచి కథ దొరికితే మాత్రం రష్మీతో కచ్చితంగా చేస్తాను. హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్నీ రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా పర్లేదు. అందర్నీ నేను నవ్విస్తూ ఉండాలని భావిస్తాను. మాస్ కథలు, ట్విస్ట్ ఉన్న కథలంటే ఇష్టం' అని సుధీర్ అన్నారు.