Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలీవుడ్లో ఆస్కార్ ఫీవర్ రోజు రోజుకి మరింత ఊపందుకుంటోంది. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్ నామినేషన్ల జాబితాని విశ్లేషించి ఏ సినిమా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది, ఏఏ నటీనటులు ఉత్తమ నటీనటులుగా నిలుస్తారనే విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఈ విశ్లేషణల్లో ఎక్కువ ఆస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టే చిత్రంగా 'ద రెవెనెంట్' చిత్రం నిలిచింది. ఉత్తమ చిత్రంగానే కాకుండా ఇందులో నటించిన లియోనార్డో డికాప్రియోకు ఉత్తమ నటుడిగా ఆస్కార్ వస్తుందని విశ్లేషణలు ఘంటాపదంగా చెబుతున్నారు. అభిమానులు, చిత్ర విమర్శకుల విశ్లేషణలోని సారాంశ మేమిటో ఓసారి చూద్దాం.. 'ఈసారి ఆస్కార్ అవార్డులలో అధిక భాగం ఆ 'దెయ్యాని'కే లభిస్తాయి. ఆ దెయ్యం పేరు 'ద రెవెనెంట్'. ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించిన లియోనార్డోకు ఉత్తమ నటుడి అవార్డు లభించడం ఖాయం. 'ఉత్తమ నటుడిగా లియోనార్డోకి ఇచ్చి తీరాల్సిందే'నని ఆస్కార్ అవార్డ్స్ నిబంధనల్ని సైతం అతిక్రమిస్తూ ఫిల్మ్‌మేకర్ హార్వీ వీన్స్ట్రెన్ ఓ బహిరంగ వేదికలో ఇచ్చిన స్టేట్మెంటే ఇందుకు నిదర్శమంటున్నారు. ఆస్కార్ కమిటీలో ఓటు హక్కు ఉన్న ఎవ్వరూ ఇలా బహిరంగ ప్రకటనలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినా వీన్స్ట్రెస్ ఆ నింబంధనని పట్టించుకోలేదు. పైగా 'అతని నటన బాగుంది. అందుకే అవార్డు ఇచ్చి తీరాలన్న నా అభిప్రాయం సరైనదే' అని కూడా ఆయన సమర్థించుకుంటున్నారు. ఆస్కార్ బరిలో 'ద రెవెనెంట్' చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ మేకప్, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ హెయిర్ స్టయిలింగ్, ఉత్తమ ప్రొడక్షన్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ వంటి తదితర విభాగాల్లో ఇప్పటికే నామి నేషన్లు పొంది ఆస్కార్ బరిలో అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది.