Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''వీడెవడు' సచిన్ జోషి కెరీర్లో బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుంది. ఆయన కెరీర్కిదొక మంచి ఫ్లాట్‌ఫామ్ అవుతుంది' అని అంటున్నారు దర్శకులు తాతినేని సత్య. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వీడెవడు'. ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం దర్శకుడు తాతినేని సత్యతో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలేమిటో ఓ లుక్కేద్దాం..
సినిమాకు వస్తున్న స్పందన ఎలా ఉంది?
- శుక్రవారం విడుదలైన సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సచిన్ గతంలో చేసిన ఏ సినిమాకూ ఈ స్థాయిలో స్పందన రాలేదు. వాటితో పోల్చితే చాలా బెటర్. అంతేకాదు ఆయన కెరీర్‌కిది ఫస్ట్ హిట్ అని అందరూ అంటున్నారు. ఈ చిత్రంతో సచిన్ కెరీర్‌కి మంచి ఫ్లాట్‌ఫామ్ దొరికినట్లైంది. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్‌లో ఊహించని స్పందన రాబట్టుకోవడం ఆనందంగా ఉంది. సినిమాపై మౌత్ టాక్ పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాం. అప్పుడే హ్యాపీగా ఉంటాం.
ఈ శుక్రవారం నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. పోటీలో రిలీజైతే కలెక్షన్లపై ప్రభావం పడుతుంది కదా!
- పోటీ అనేది కరెక్ట్ కాదు. కానీ తప్పని పరిస్థితులో విడుదల చేయాల్సి వచ్చింది. సినిమా అంటే సచిన్‌కు ప్యాషన్. ఆయనకున్న ప్యాషన్‌తోనే పోటీకి సిద్ధమయ్యాం. మంచి సినిమాలకు రెండు వారాల గ్యాప్ కావాలి. అప్పుడే సరైన ఆదరణ పొందుతుంది. కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు హెల్ప్ అవుతుంది. ఒకప్పుడు రెండు వారాల గ్యాప్‌తో సినిమాలు విడుదలయ్యేవి. ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు సినిమాలొస్తున్నాయి. ఈ ప్రభావం కలెక్షన్లపై కచ్చితంగా పడుతుంది. 'భీమిలి కబడ్డీ జట్టు' చిత్రం విడుదలప్పుడు తొలి రోజు జీరో కలెక్షన్లు.
మూడు రోజుల(సోమవారం) తర్వాత అందరికి సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అది పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఇలాంటి సినిమాకు గ్యాప్ తప్పనిసరి. పెద్ద హీరోల సినిమాలొస్తే సినిమా బాగున్నా వాటి ధాటికి నలిగిపోతుంది.
'భీమిలి కబడ్డీ జట్టు', 'శంకర' తర్వాత మళ్ళీ రీమేక్‌లు చేసే ఆలోచన ఉందా?
- 'శంకర' తర్వాత రీమేక్‌లు మానేయాలనుకున్నా. అందుకే ఈ కథ రాసుకున్నా. 'సూదుకవ్వం' అనే సినిమాను కూడా రీమేక్ చేయాలని అడిగారు. అయితే దాన్ని నా నిర్మాణంలోనే చేయాలనుకున్నా. కానీ కుదరలేదు. స్ట్రయిట్ కథలపై దృష్టిపెట్టాను. పబ్లిక్ రిలేషన్స్ గురించి నాకు పెద్దగా తెలియకపోవడంతో వెంటవెంటనే సినిమాలు తీయలేకపోతున్నాను. ఈ ఆరు నెలల్లో చాలా విషయాలు తెలుసుకున్నా.
ఇకపై మీ సినిమాలు ఎలా ఉంటాయి?
- డిఫరెంట్ థ్రిల్లర్ నేపథ్య చిత్రాలను చేయాలను కుంటున్నాను. ఎన్ని సినిమాలు చేశాననేది నాకు ముఖ్యం కాదు క్వాలిటీ ముఖ్యం.
హీరో నానికి ఓ పొలిటికల్ థ్రిల్లర్ కథను ఇటీవల నెరేట్ చేశాను. ఆయనకు స్క్రిప్ట్ బాగా నచ్చింది. దాన్ని డెవలప్ చేస్తున్నా. ఇదే కథను నిఖిల్‌కి కూడా చెప్పాను. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో ఈ సినిమా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్.