Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.సుమరాజీవ్ క్రియేషన్స్ పతాకంపై ప్రపూర్ణ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి సుమ కనకాల, రాజీవ్ కనకాల నిర్మిస్తున్న ఇండిపెండెంట్ ఫిల్మ్ 'అలనాటి రామచంద్రుడు'. సందీప్ మెండి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రవీణ్ యండమూరి, పటమట లంక నవీన్, శ్రీముఖి మేకల ప్రధాన పాత్రలు పోషించారు. 'జుజూబి' వెబ్ సిరీస్, చిత్రంలోని పాటలు, ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్రైలర్‌ను, కొరటాల శివ జుజుబీ టీవీ ఏవీని, చిత్రంలోని ఓ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ, 'నేను తీసిన యాడ్ ఫిల్మ్‌లో సుమ, రాజీవ్ కనకాల పనిచేశారు. ఆ తర్వాత నాకు తెలియకుండా పెళ్ళిచేసుకున్నారు. ఇప్పుడు కూడా నాకు తెలియకుండా ఈ సినిమా తీశారు. ఒక దర్శకుడిపై తీస్తున్న సినిమాకు దర్శకుడిగా నన్ను తీసుకోవాలి, కానీ వేరే దర్శకుడితో చేయడం బాగాలేదు(నవ్వుతూ). ఇందులో రాముడి పాత్రకు నన్ను తీసుకోలేకపోయినా ఫర్వాలేదు, నెక్ట్స్ కృష్ణుడి పాత్ర పెడితే మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. వెబ్ సిరీస్‌లో దీన్ని విడుదల చేయడం మంచి విషయం. టీమ్ అందరికీ ఆల్‌ది బెస్ట్' అని అన్నారు. 'సుమ, రాజీవ్ ఎంత స్పాంటేనియస్‌గా, క్రియేటివ్‌గా ఉంటారో మనకు తెలుసు. వారి నుంచి వచ్చే సినిమా కూడా అంతే క్రియేటివ్‌గా ఉంటుందని భావిస్తున్నాం. ఈ చిత్రం మంచి ఆదరణ పొందాలి' అని కొరటాల శివ తెలిపారు. సుమ, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, 'కొత్తవాళ్ళను ప్రోత్సహించాలని ఈ బ్యానర్ స్థాపించాం. ఇండిపెండెంట్‌గా ఫిల్మ్‌గా తీసిన ఈ చిత్రాన్ని జుజూబి వెబ్ సిరీస్‌లో విడుదల చేస్తాం. దర్శకుడు సందీప్ మెండి మంచి కథను అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ఇదొక దర్శకుడి స్టోరీ. వయసు మీద పడినా తన ప్యాషన్‌ను నెరవేర్చుకోవడానికి అతను ఏం చేశాడనేది కథ. ఆద్యంతం అలరిస్తూనే ఆలోచింప చేస్తుంది' అని చెప్పారు. 'సుమ, రాజీవ్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వినూత్నమైన చిత్రమవుతుంది' అని దర్శకుడు సందీప్ మెండి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, శ్రీముఖి, జగదీష్, సంతోష్, హర్ష, యమున కిషోర్ తదితరులు పాల్గొన్నారు.