Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధుర్ భండార్కర్.. బాలీవుడ్లో ఆయన రూటే సపరేట్. సమాజంలోని వాస్తవ సంఘటనలకు, మనుషుల జీవితాలకు తెరరూపమిస్తూ రాణిస్తున్నారు. సామాజిక ఇతివృత్తాలకు వాణిజ్య హంగులద్ది ఆయన రూపొందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడంతోపాటు జాతీయ అవార్డులను అందుకున్నాయి. అంతేకాదు ప్రజలకు కావాల్సిన వినోదంతోపాటు సందేశాన్నిచ్చి ప్రశంసలందుకున్నారు. 'చాందినీబార్', 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగల్' వంటి జాతీయ అవార్డు చిత్రాలను తెరకెక్కించిన మధుర్ భండార్కర్ ఇటీవల 'ఇందు సర్కార్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రధాని ఇందిరాగాంధీ టైమ్‌లో చోటు చేసుకున్న ఎమర్జెన్సీ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం అనేక అడ్డంకులను తొలగించుకుని ఇటీవల విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత మధుర్ భండార్కర్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ విశేషాలేమిటో చూద్దాం..
దాదాపు రెండు దశబ్దాల సినీ జీవితంలో మీలో వచ్చిన మార్పేంటి?
- వ్యక్తిగా నేను ఏమాత్రం మారలేదు. నాకున్న స్నేహితులతో నేనెప్పుడూ ఒకేలా ఉన్నా. నాతో ఎవరు ఎక్కువగా చనువుగా ఉంటారో వారికి ఈ విషయం తెలుసు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. రోడ్డుపై పానీ పూరీ, వడలు ఇప్పటికీ తింటాను. విజయాలు, అవార్డులు నన్నేమి మార్చవు. సినిమా పరిశ్రమ ఒక మాయా ప్రపంచమనేది నాకు తెలుసు. ఇక్కడి వారు గాల్లో తేలియాడుతుంటారనీ కూడా
తెలుసు. కానీ నేను అలా కాదు. విజయాలను తలకెక్కించుకోను. నాది ఎప్పడూ వన్ మ్యాన్ షో. నేను చేసే పని సినిమాల్లో కనిపిస్తుంది.
లక్కీ నంబర్‌ను నమ్ముతారా?
- ఇది నేను నిర్ణయించాల్సింది కాదు, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. వాళ్ళకు నచ్చిందా? లేదా అన్నది వాళ్లే చెబు తారు. ఈ లక్కీ నెంబర్స్‌ని నేను నమ్మను. కొత్త ఐడియాలు వస్తుం టాయి, సినిమాలు చేసుకుంటూ పోతానంతే. నేను తీసే సినిమా కథలు ప్రతిసారి కొత్తగా, విభిన్నంగా ఉండేలా చూసుకుంటాను. అలా విధంగా ప్రతి సినిమాను లక్కీగానే భావిస్తాను.
అవార్డులను, రివార్డులను ఎలా రిసీవ్ చేసుకుంటారు?
- అవార్డులు కచ్చితంగా ఫిల్మ్ మేకర్స్‌కి ప్రశంసలే. అవి ప్రోత్సాహాన్నిస్తాయి. రివార్డులు దర్శకుడికి ఒక్కడికే బెనిఫిట్ అయ్యేవి కావు, చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి అవి చెందుతాయి. వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. అదే సమయంలో ప్రజలు నా శక్తిసామర్థ్యాలను గుర్తించినందుకు ఆనందపడతాను. అవార్డులు వచ్చాయంటే నాలో టాలెంట్ ఉందని వారు నమ్ముతున్న ట్టుగా భావిస్తాను.
కథల విషయంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అంశాలేంటి?
- నేనెప్పుడూ విభిన్న కథా చిత్రాలే తీయాలనుకుంటాను. ప్రేక్షకులు కూడా నేను ఇలాంటి సినిమాలే తీయాలని కోరుకుంటున్నారు. నా నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అందులో సామాజిక అంశాలు, రోజు వారి సమస్యలు ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. వాళ్ళకి కావాల్సిందే నేనివ్వడానికి ప్రయత్నిస్తాను. నేను రూపొందించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలతోపాటు కమర్షియల్గానూ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతాయి. ఇలాంటి సినిమాలు తీసే అతికొద్దిమంది దర్శకుల్లో నేను ఒకడిని అవడం హ్యాపీగా ఉంది.
హిట్ సినిమా తీయడానికి ఏదైనా ఫార్ములా ఉందా?
- హిట్ సినిమాకు ఫార్ములా అంటూ ఏం లేదు. తీసే సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఎవరూ ఊహించలేరు. నా విషయంలో నన్ను నేను నమ్ముతాను. కానీ ఒక శుక్రవారం(సినిమాలు విడుదలయ్యే రోజు) గేమ్ మొత్తం మార్చేస్తుంది. మన తలరాత మార్చుతుంది. అదే సందర్భంలో మన ఎనిమీస్ను వదిలిస్తుంది. అంతేకాదు మన స్నేహితులను కూడా మార్చేసే శక్తి ఒక్క శుక్రవారానికే ఉంది. కాబట్టి మన గట్స్ ఫీలింగ్‌తో ముందుకు సాగాలి. సినిమాల హిట్స్ విషయంలో నేను అదృష్టవంతుగానే భావిస్తున్నా. ఎందుకంటే నేను రూపొందించిన చిత్రాలు 70శాతం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలనిచ్చాయి. నేను దర్శకుడినే కాదు, నిర్మాతని కూడా. తక్కువ బడ్జెట్లో సినిమా తీయడం కూడా నాకు కలిసొచ్చే అంశం.
'ఇందు సర్కార్' సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది?
- 'క్యాలెండర్ గర్ల్స్' సినిమా సరిగా ఆదరణ పొందలేదు. ఆ టైమ్‌లో ఇందు సర్కార్‌పై సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా తట్టింది. ఎమర్జెన్సీ నేపథ్యంపై ఇప్పటి వరకు ఎవరూ పూర్తి స్థాయి సినిమా తీయలేదు. ఎమర్జెన్సీ బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. ఇది కొంచెం ఇబ్బంది కరమైన అంశమే అయినా అనుకున్న బడ్జెట్లోనే తీయగలిగాం.
ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులను ఎలా ఫేస్ చేశారు?
- సెన్సార్‌షిప్‌లో ఇబ్బందులు నాకేం కొత్త కాదు. ఎప్పుడూ అలాంటి అడ్డంకులు ఎదుర్కొంటూనే ఉన్నాను. ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ వచ్చింది.ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తవించాలి. నేను రూపొందించిన 'దిల్ తో బచ్చా హై జీ' చిత్రంలో 'వర్జిన్' పదాన్ని వాడినందుకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. అదే సెన్సార్ బోర్డ్ 'పేజ్ 3', 'ట్రాఫిక్ సిగల్' చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఇందులో డ్రగ్స్ తీసుకునే సన్నివేశాలున్నాయి. కానీ ఈ చిత్రాలకే జాతీయ అవార్డులు దక్కాయి.
మీరు రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు?
- వేరే వాళ్ళు తీసిన సినిమాను రీమేక్ చేయడం కరెక్ట్ కాదు. కానీ రీమేక్ చేయాల్సి వస్తే 'చాందినీ బార్' చిత్రాన్నే భారీ బడ్జెట్ తీయాలనుంది. ఆ చిత్రాన్ని అప్పుడు 1.5కోట్ల బడ్జెట్‌తో తీశా. అది 'హీరోయిన్' చిత్రంలో కరీనా కపూర్ వాడిన కాస్ట్యూమ్ ఖర్చంతా(నవ్వుతూ).
నెక్ట్స్ ఎలాంటి సినిమా తీయబోతున్నారు?
- పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ సినీ మేకర్స్, హీరోల భార్యలపై సినిమా తీయాలనుంది. దీనికి సంబంధిం చిన స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేశా. స్క్రిప్ట చాలా బాగా వచ్చింది. దీనికి టైటిల్‌ను కూడా కన్ఫమ్ చేశాం. ఈ సినిమాను ఇప్పుడు తీస్తే కచ్చితంగా బాలీవుడ్లో చర్చనీయాంశమైన చిత్రమవుతుంది.