Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే నేను హీరోగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఈచిత్ర ఫలితం నాకొక బోనస్‌గా భావిస్తాను' అని అంటున్నారు కథానాయకుడు కార్తికేయ. రిషి దర్శకత్వంలో కార్తికేయ, సిమ్రాత్ జంటగా ఆర్.గుమ్మకొండ నిర్మించిన చిత్రం 'ప్రేమతో మీ కార్తీక్'.
ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్ర కథానాయకుడు కార్తికేయ బుధవారం మీడియాతో ముచ్చటించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 'సినిమాల్లోకి రావాలని చిన్నప్పట్నుంచి అభిలాష. బీటెక్ పూర్తయ్యాక కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాను. సినిమాల్లో అవకాశాలొస్తే బాగుండని చాలా సార్లు అనుకున్నాను. ముగ్గురు, నలుగురు హీరోలున్న సినిమాల్లో అయినా అవకాశం వస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఈ చిత్రంలో సోలో హీరోగా చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా ఫీలవుతున్నాను. కథ విషయానికొస్తే, ఇదొక అమెరికాలో పుట్టి, పెరిగిన అబ్బాయి కథ. ప్రేమ, భావోద్వేగాలు తెలియని కుర్రాడు. ఓ అమ్మాయి రాకతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది కథ. మంచి కథ, కథనం, సంగీతంతో తెరకెక్కిన చిత్రమిది. హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రంలోనే గొల్లపుడి మారుతిరావు, మురళీశర్మ, ప్రగతి వంటి తదితర సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈచిత్రంలో గొల్లపుడిగారి ఎపిసోడ్ చాలా కీలకంగా ఉంటుంది. దర్శకుడు సత్యకు ఇది తొలిచిత్రమైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతలు ఈచిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు' అని తెలిపారు.