Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తొలి యాబై చిత్రాలు వేగంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం వేగం తగ్గించాను. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను' అని అంటున్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్. 'కిక్', 'బృందావనం', 'రగడ', 'మిరపకారు', 'నాయక్', 'షాడో', 'బాద్షా', 'గౌరవం', 'తడాఖా', 'బలుపు', 'మసాలా', 'రేసుగుర్రం', 'రభస', 'పవర్', 'ఆగడు', 'కిక్ 2', 'పండగ చేస్కో', 'డిక్టేటర్', 'సరైనోడు', 'విన్నర్', 'గౌతమ్‌నంద', 'మహానుభావుడు', 'రాజుగారి గది 2' వంటి తదితర చిత్రాలతో సంగీత దర్శకుడిగా థమన్‌కి తెలుగునాట మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపుని ఇంకా మెరుగుపర్చుకుంటానని అంటున్న
థమన్ పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా బుధవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే, 'ఎనిమిదేండ్ల వయసులోనే నా సినీ ప్రయాణం ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏండ్లు అవుతోంది. కీ బోర్డ్ ప్లేయర్‌గా ఏ.ఆర్.రెహ్మాన్, మణిశర్మ, కీరవాణితోపాటు దాదాపు అందరూ సంగీత దర్శకుల వద్ద 900 చిత్రాలకు పైగా పని చేశాను. ఈ ప్రయాణంలో వారి దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీత దర్శకుడిగా ఇప్పటివరకు 72 చిత్రాలు పూర్తయ్యాయి. వంద చిత్రాల దిశగా పయనిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి యాభై చిత్రాలు చాలా వేగంగా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు వేగం తగ్గించాను. కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా భిన్న నేపథ్య చిత్రాలకూ సంగీతం అందించాలని ఆశిస్తున్నాను. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాను. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిజం ప్రధానంగా సాగే సినిమాలదే ఆధిపత్యం. వారి ఇమేజ్‌కు అనుగుణంగానే సంగీతాన్ని అందించాలి. ప్రస్తుతం పాటల విడుదల ధోరణిలో కూడా చాలా మార్పులొచ్చాయి. గతంలో ఒకే రోజున ఆరుపాటల్ని విడుదల చేసేవారు. అందులో మంచి కిక్ ఉండేది. ప్రస్తుతం ఓ సినిమా ప్రమోషన్ నాలుగైదు నెలల పాటు సాగుతోంది. దాంతో ఒక్కో పాటను, ఒక్కోలా విడుదల చేయటం ట్రెండ్‌గా మారింది. టాలీవుడ్లో నాకు సాయి ధరమ్ తేజ్ అత్యంత ఆప్తుడు. ఇద్దరం కలిసి గతంలో కొన్ని సినిమాలు చేశాం. కానీ సక్సెస్ మాత్రం కొట్టలేకపోయాం. ఆ లోటుని భర్తీ చేసేలా మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న 'జవాన్' చిత్రం ఉంటుంది. కమర్షియల్, హర్రర్, మాస్.. ఇలా ఏ తరహా చిత్రం విషయంలోనైనా సంగీత దర్శకుడిగా నా పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. వంద చిత్రాలకు చేరువవుతున్నప్పటకీ సంగీత దర్శకుడిగా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది' అని పేర్కొన్నారు.