Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరో,హీరోయిన్లుగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. ఈ చిత్ర ఆడియో టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, 'ఏడాది క్రితం దర్శకుడు గౌతమ్ ఈ కథను నెరేట్ చేశారు. విని షాక్ అయ్యా. చాలా క్లారిటీతో ఉన్నాడు. ఇంత వరకు నా కెరీర్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా చెప్పిన డైరెక్టర్‌ను చూడలేదు. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా. అత్యంత సహజంగా సాగే ప్రేమ కథ ఇది. 'గోదావరి' సినిమా తర్వాత అంతటి సంతృప్తినిచ్చింది. టెస్ట్ షో వేశాం. చూసిన వారందరూ భావోద్వేగానికి గురై అభినందించారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ పాత్ర సినిమాలో సర్ప్రైజింగ్గా ఉంటుంది. అందరికీ మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమవుతుంది' అని అన్నారు. 'రెండేండ్ల క్రితం ఈ కథ రాసుకుని చాలా మంది నిర్మాతలను కలిశా. కథ నచ్చింది. కానీ నేను కొత్త కావడంతో నన్ను నమ్మి నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. రాహుల్ యాదవ్ సినిమా చేయడంతో ఇక్కడి వరకు వచ్చింది. కార్తీక్, అంజలి పాత్రల మధ్య నడిచే లవ్ డ్రామా ఇది. చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా వారి జీవితంపై ఎలాంటి ప్రభావం పడిందో తెలిపే కథాంశమిది. 30 రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేశాం. శ్రవణ్ అందించిన సంగీతం సినిమాకు సోల్ అవుతుంది' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత రాహుల్ యాదవ్ చెబుతూ, 'అందరూ కష్టపడి ఇష్టపడి మంచి రిజల్ట్ రావడం కోసం పనిచేశారు. 10 నెలలపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. సుమంత్ మాకు చాలా సపోర్ట్‌ను అందించారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.