Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏ రంగంలోనైనా హద్దులుంటాయి. కానీ సినిమాకు ఎలాంటి బౌండరీలుండవు. ఎలా అయినా, ఎక్కడైనా తీయోచ్చు. అందుకే ఈ రంగంలోకి అడుగుపెట్టాను' అని అంటున్నారు దర్శకుడు పవన్ మల్లెల. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెల రూపొందించిన చిత్రం 'బాలకృష్ణుడు'.
నేడు (శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ మల్లెల గురువారం మీడియాతో సంభాషించిన విశేషాలు..
కృష్ణవంశీ, వినాయక్‌ల ప్రభావం..
మాది విజయవాడ అయినప్పటికీ చెన్నైలో హయ్యర్ స్టడీస్ చేశాను. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి ఫిల్మ్ కోర్స్ కంప్లీట్ చేశాను. సినిమాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను. కృష్ణవంశీ, వి.వి.వినాయక్ సినిమాల షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడిని. దీంతో నాపై కృష్ణవంశీ, వినాయక్‌ల ప్రభావం ఉంటుంది. నాకు వేరే ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. మిగతా ఏ రంగంలోనైనా రిస్టిక్షన్స్ ఉంటాయి. కానీ సినిమాలో 360 డిగ్రీస్‌లో మనం ఎక్కడైనా సినిమా చేయోచ్చు, ఎలాగైనా తీయోచ్చు. అందుకే సినీ రంగాన్ని ఎంచుకున్నా.
కమర్షియల్ కథ కోసం వెయిట్ చేస్తున్నారు..
ఓ కథపై నాలుగేండ్లుగా హోం వర్క్ చేశాను. అది ఎవరికీ నచ్చలేదు. ఈ క్రమంలో రైటర్ రాజా ఈ కథతో నన్ను కలిశారు. నాకు బాగా నచ్చింది. అజరు ద్వారా నారా రోహిత్‌ని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేశాం. రోహిత్ అంతకు ముందు విభిన్న కథా చిత్రాలు చేశారు. ఆ టైమ్‌లో మంచి కమర్షియల్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దీంతో మా కథకు బాగా కనెక్ట్ అయి వెంటనే ఒప్పుకున్నారు. సినిమాను ఎక్కడా రాజీపడకుండా రిచ్‌గా తీశాం. దీంతో బడ్జెట్ కూడా బాగా అయ్యింది.
ఫుల్ ఎంటర్టైనర్..
ఇది కొత్త కథ కాదు, రెగ్యులర్‌గానే ఉండే పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం. వాణిజ్య హంగులన్నీ ఉంటాయి. జస్ట్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా రూపొందించాం. 2006 నుంచి కథ సాగుతుంది. చిన్నప్పుడు హీరోయిన్‌కి సమస్య వస్తే హైదరాబాద్‌లో ఉన్న మేనత్త వద్ద పెంచుతారు. పెద్దైన ఆమెను హీరో చూసి ప్రేమలో పడతారు. తన కోసం ఏం చేశాడనేది సినిమా. ఒక్క రోజులో జరిగే కథ ఇది. రోడ్ జర్నీ నేపథ్యంగా సాగుతుంది. జర్నీ చేసేటప్పుడు చోటు చేసుకునే సన్నివేశాలు ఆసక్తికరం. రాయలసీమ ప్రధానంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో నారా రోహిత్ అల్లరి చిల్లరి కుర్రాడిగా కనిపిస్తాడు. ముగ్గురు ప్రముఖుల వాయిస్‌ను ఇమిటేట్ చేశారు. అది ప్రస్తుతానికి సస్పెన్స్. నారా రోహిత్ చేసిన సినిమాలు సైలెంట్‌గా ఉంటాయి. కాని బేసిక్‌గా ఆయన కూడా అల్లరి కుర్రాడే. నారా రోహిత్, రెజీనాల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. నారా రోహిత్, పృథ్వీల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
కోర్స్ బాగా ఉపయోగపడింది..
ఆస్ట్రేలియాలో నేర్చుకున్న ఫిల్మ్ కోర్స్ సినిమాకు బాగా ఉపయోగపడింది. డిఫరెంట్ యాంగిల్స్‌లో రెెండు మూడు కెమెరాలు ఉపయోగించి, త్వరగా షూటింగ్ చేశాం. ప్లాన్ ప్రకారం 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. నారా రోహిత్ చాలా సపోర్ట్ చేశారు. మణిశర్మ ఆర్ ఆర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఫ్రెండ్స్‌తో కలిసి మేమే నిర్మించాం కాబట్టి సినిమా ఫలితంపై టెన్షన్‌గా ఉంది. ఈ సినిమా రిజల్ట్ ఆధారంగానే తదుపరి చిత్రం ఏంటనేది తెలుస్తుంది. కథలు మాత్రం రెడీగా ఉన్నాయి.