Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ డెడికేట్ పోలీస్ ఆఫీసర్ తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే' అంటున్నారు దర్శకుడు విక్రమ్ సిరికొండ. రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మాతలు.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శుక్రవారం దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ, 'నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. సినిమాలపై ఆసక్తితో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాతో రచయితగా మారాను. 'ఠాగూర్' సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. 'బన్నీ', 'సాంబ' తదితర చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశాను. దర్శకుడిగా ఛాన్స్‌ల కోసం తిరుగుతున్న క్రమంలో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. వక్కంతం వంశీ అందించిన కథను అంతే అందంగా తెరపై ఆవిష్కరించాం. మనం చేసే పని మన కంటే గట్టిగా మాట్లాడుతుందని నా నమ్మకం. అలాగే ఈ సినిమా నాకంటే బాగా మాట్లాడుతుందని నమ్ముతున్నా. జీవితంలో సమతూకం ఉండాలనేది నిజం. అదే విషయాన్ని ఈ సినిమాలో చెప్పబోతున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే గొడవలవుతాయి. అలాగే రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే యుద్ధం జరుగుతుంది. ఓ డెడికేట్ పోలీస్ ఆఫీసర్ తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడో ఈ సినిమా చెబుతుంది. రెండు కాలాల్లో సాగే చిత్రమిది. చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. రవితేజ ద్విపాత్రాభినయం చేయలేదు. ఒకే పాత్రను రెండు డిఫరెంట్ పీరియడ్స్, బ్యాక్‌డ్రాప్స్ మధ్య చేశారు. ఇప్పటి వరకు రవితేజ చేసిన పోలీస్ పాత్రలకిది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎమోషనల్ టచ్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఇందులోని పోలీస్ పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్ను ఇన్స్పైర్ చేస్తుందని నమ్ముతున్నా. రైటర్‌గా నేను లవ్, ఎమోషనల్ సన్నివేశాలను బాగా రాయగలను. ఇందులో ఆ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకున్నా. 'మిరపకారు' చిత్రం నుంచి రవితేజతో మంచి అనుబంధం ఉంది. కథానాయికలు రాశీఖన్నా, సీరత్ కపూర్ పాత్రలు సినిమాలో కీలకంగా ఉంటాయి. విడుదలయ్యాక ఇద్దరి పాత్రలకు మంచి పేరొస్తుంది. సినిమాలో మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉండాలని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్‌ను తీసుకున్నాం. నిర్మాతలు బాగా సహకరించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.