Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తొలిప్రేమ' కాంటెంపరరీ లవ్ స్టోరీ. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే చిత్రం. ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది' అని చిరంజీవి అన్నారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన 'తొలిప్రేమ' చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో సినిమాను వీక్షించిన చిరంజీవి శుక్రవారం చిత్ర బృందాన్ని తన నివాసంలో అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'తొలిప్రేమ' వంటి పెద్ద సక్సెస్‌ను సాధించిన చిత్ర బృందానికి నా అభినందనలు. దర్శకుడు వెంకీ అట్లూరిని ప్రత్యేకంగా అభినందించాలి. నా బ్రదర్ పవన్ నటించిన 'తొలిప్రేమ' టైటిల్‌తో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ కలిగింది. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అయితే ఇది పక్కా కమర్షియల్ చిత్రం. నటీనటులంతా పాతవాళ్లే. కానీ తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ట్రెండీగా ఉంది. కథ కన్నా సిచ్చ్యువేషనల్గానే సినిమా అంతా సాగుతుంది. ఇలా చేయడం డైరెక్టర్‌కి చాలా పెద్ద ఛాలెంజింగ్. ఇంత ఫ్రెష్‌గా ఉందంటే దర్శకుడు వెంకీ ఫ్రెష్ థాట్ వల్లే. ఓ కొత్త కోణంలో సినిమాను చూపించారు. ఇలాంటి దర్శకులు ఇండిస్టీకి అవసరం. కొత్తదనంతో కూడిన సినిమాలు రావడం వల్ల పక్క పరిశ్రమలు కూడా మన గురించి మాట్లాడుకుంటున్నాయి.
వరుణ్ తేజ్ ఎంతో మెచ్యూర్డ్‌గా నటించాడు. సినిమాలో వరణ్‌ని కాకుండా ఓ యంగ్ బారుని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మూడు వేరియేషన్స్‌లో తనని తాను మలుచుకున్న తీరు సూపర్. ప్రేమ సన్నివేశాలు, ఇగో క్లాషెస్ సన్నివేశాల్లో వరుణ్, రాశీఖన్నా బాగా ఇన్వాల్వ్ అయి నటించి మనల్ని అందులో లీనమయ్యేలా చేశారు. కొన్ని సన్నివేశాల్లో వరుణ్ నటన, పలికించిన భావోద్వేగాలు చూసి మా ఫ్యామిలీ అంతా గర్వపడుతున్నాం.
తన ఎత్తుకు డాన్సులు ఎంత వరకు కుదురుతాయో అనుకున్నా, కానీ ప్రతీ స్టెప్‌ను అడాప్ట్ చేసుకుని బాగా చేశాడు. నాగబాబు గర్వపడే మూవ్మెంట్ ఇది. వాళ్ళనాన్న నాగబాబుకు వరుణ్ ఈ సినిమాతో మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఇందులో ఓ కొత్త రాశీఖన్నాను చూస్తాం. థమన్ సంగీతం సినిమాకు హైలైట్. కెమెరామెన్ జార్జి సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. అందంగా చూపించారు. చరణ్ అభిమానించే నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. బడ్జెట్ విషయంలో రాజీపడకుండా నిర్మించారు' అని అన్నారు.
'నాకు యాక్టర్ అవ్వాలన్నా ఆలోచన పెదనాన్న చిరంజీవిని చూసే వచ్చింది. ఈ రోజు డాడీ (చిరంజీవి) వచ్చి మంచి మాటలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది' అని వరుణ్ తేజ్ తెలిపారు.
దర్శకుడు వెంకీ అట్లూరి చెబుతూ, 'చిన్నప్పుడు 'స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్' సినిమా టైమ్‌లో చిరంజీవిని చూశా. మళ్ళీ ఇన్నాళ్ళకు చిరంజీవి పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం రావడం మరచిపోలేని అనుభూతి. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఆయన సినిమా చూసి, నచ్చి మమ్మల్ని ప్రశంసించడం చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా సక్సెస్ మరింత బాధ్యతను పెంచింది' అని చెప్పారు.
'33 ఏండ్ల క్రితం సినిమాలు చేద్దామని పసుపులేటి రామారావు ద్వారా ఓ అభిమానిగా చిరంజీవిని కలిశాను. ఇన్నేండ్లకు చరణ్, పవన్, బన్నీ, ఇప్పుడు వరుణ్‌తో సినిమాలు చేసే అవకాశం లభించినందుకు హ్యాపీగా ఉంది' అని నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తెలిపారు.
'నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయన మమ్మల్ని అభినందించడం ఇంటర్ పాసై డిగ్రీ కాలేజ్‌కి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది' అని థమన్ అన్నారు.