Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, నాజియా హీరోహీరోయిన్లుగా విజి చెర్రీష్ విజన్ దర్శకత్వంలో శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీష్ విజన్స్ పతాకంపై విజరు నిర్మిస్తున్న చిత్రం 'రా..రా..'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన హీరో నాని, తరుణ్ సంయుక్తంగా శ్రీకాంత్ వెబ్‌సైట్‌ను, మొబైల్ యాప్‌ను, చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, 'శ్రీకాంత్ అన్న నటించిన 'రాధాగోపాలం' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అప్పుడు టెక్నాలజీకి అన్నయ్య అంతగా కంఫర్టబుల్ కాదు. సోనీ ఫోన్ కొని దీన్ని ఎలా వాడాలో చూపించమన్నారు. అలాంటి శ్రీకాంత్ అన్న ఇప్పుడు ఏకంగా మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఐఫోన్లాగా ఆయన కూడా అప్డేట్ అయ్యారు. సినిమా హర్రర్ కామెడీగా ఉంది. ఇది కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. టీమ్‌లో పనిచేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీరు 'రా..రా..' అన్నారు. ఆడియెన్స్ అంతా వచ్చి సినిమాను పెద్ద విజయాన్ని అందించాలి' అని అన్నారు.
'శ్రీకాంత్ ఇప్పటి వరకు 125 చిత్రాలు చేసి, హర్రర్ సినిమా చేయలేదు. 126గా హర్రర్ సినిమా చేయడం సూపర్. ఈ ట్రైలర్ చూస్తుంటే పూర్తి స్థాయి హర్రర్ కామెడీలాగా ఉంది. మంచి ఆదరణ పొందుతుందనుకుంటున్నాం. సినిమాలో సీనియర్ కమెడియన్స్ అంతా ఉన్నారు. 'చంద్రముఖి'లో ఉన్న 'రా.. రా..' అనే పదమే ఆ సినిమాను ఎక్కడితో తీసికెళ్ళింది. ఆ పదాన్నే దీనికి టైటిల్‌గా పెట్టారు. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది' అని తరుణ్ తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, 'ఇది నా ఫస్ట్ హర్రర్ చిత్రం. సబ్జెక్ట్ విన్నప్పుడే కచ్చితంగా కొత్తగా అనిపించింది. గతంలో వచ్చిన హర్రర్ సినిమాలతో పోల్చితే ఇది సపరేట్ జోనర్. నాకు మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నా. నిర్మాతలు విజరు, చౌదరి నా వెన్నంటే ఉండి బాగా సపోర్ట్ చేశారు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'శ్రీకాంత్‌తో 24ఏండ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఇప్పటి వరకు పెద్ద హీరోలు చేయనటువంటి జోనర్ ఇది. శ్రీకాంత్ తొలిసారి చేశారు. కథ చాలా కొత్తగా ఉంటుంది. హాస్యనటులంతా దెయ్యాలుగా ఆకట్టుకుంటారు. సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని నిర్మాతలు తెలిపారు.