Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. రవితేజకి జోడీగా మాళవిక శర్మ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఆ విశేషాల గురించి చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, ''రాజా ది గ్రేట్'తో అదరగొట్టిన రవితేజ హీరోగా, 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోరు వేడుక చూద్దాం' వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. కథ, కథనాలతోపాటు 'ఫిదా' ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ సమకూర్చుతున్న బాణీలు, ముఖేష్ అద్భుతమైన కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఏకధాటిగా జరుపుతున్న షూటింగ్‌తో ఇప్పటివరకు దాదాపు 60శాతం చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే చివరి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నాం' అని చెప్పారు. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి. కెమెరా: ముఖేష్.