Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన 'ఆరమ్' చిత్రాన్ని తెలుగులో 'కర్తవ్యం' పేరుతో నిర్మాత శరత్ మరార్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో నిర్మాత శరత్ మరార్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, 'మా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్పై పవన్ కళ్యాణ్‌తో మంచి సినిమాలు చేశా. ఆ తర్వాత మెడికల్ మాఫియా గురించి ప్రజలందరికి తెలిసేలా 'అదిరింది' సినిమాను అందించాం. దానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు 'కర్తవ్యం' సినిమాను చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుస్తుంది. మీడియాలో, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి మంచి చిత్రాన్ని చూసినప్పుడు నా మనసు చలించిపోయింది. దర్శకుడి ప్రతిభ, నయనతార, ఇతర నటీనటుల నటన నన్ను కట్టిపడేసింది. జిబ్రాన్ మ్యూజిక్ భావోద్వేగంలో ముంచేసింది. ఈ సినిమా ఒక రోజంతా నన్ను వెంటాడింది. అసలు గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇంత అవస్థ పడాలా అనే ప్రశ్న నాలో నేను వేసుకున్నాను. డబ్బుల కోసం కాకుండా, మనుషుల కోసం కొన్ని చిత్రాలుంటాయని గట్టిగా నమ్మి ఈ సినిమాను మా బ్యానర్లో తెలుగు ఆడియెన్స్‌కు చూపించాలనుకున్నా. ఈ ప్రయత్నానికి మీడియా బాగా సపోర్ట్ చేసింది. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని తెలుగులో తీసుకొచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెబుతుంటే నా కంట ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ సినిమా మా బ్యానర్ వ్యాల్యూని రెట్టింపు చేసింది. ఇలాంటి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకుడికి అందించేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా' అని చెప్పారు