Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆనందం' చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికి 'హ్యాపీడేస్'ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది' అని అంటున్నారు నిర్మాత గురురాజ్. మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన 'ఆనందం' చిత్రాన్ని అదే పేరుతో సుఖీభవ మూవీస్ పతాకంపై ఆర్.సీతారామరాజు సమర్పణలో గురురాజ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నేడు(శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురురాజ్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే..
చెబుతారు..కానీ ప్రోత్సహించరు..
కాలేజ్ స్టూడెంట్స్ పిక్నిక్కి వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న మధురమైన సన్నివేశాలతో ఆద్యంతం యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సినిమా యూత్‌తోపాటు పెద్దలందరికీ కనెక్ట్ అవుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికి తమ కాలేజ్ రోజులను గుర్తు చేస్తుంది. తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ చిన్న సినిమాలో మలయాళ స్టార్ నివిన్ పాలీ అతిథి పాత్రలో నటించడం సినిమాకు హైలైట్. మన వద్ద చిన్న సినిమాలను బతికించాలని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క స్టార్ కూడా చిన్న సినిమాలకు ప్రోత్సాహాన్ని అందించరు. మలయాళంలో స్టార్ హీరోలు చిన్న సినిమాలకు అందించే సపోర్ట్‌కి ఈ చిత్రం ఒక ఉదాహరణ.
పోటీ ఉన్నప్పటికీ కథపై నమ్మకంతో..
కథను నమ్ముకుని కొత్త ఆర్టిస్టులతో కేవలం 4 కోట్లతో రూపొందిన ఈ సినిమా అక్కడ 20 కోట్లు కలెక్ట్ చేసింది. కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి విడుదల విషయంలో పోటీ ఉన్నప్పటికీ కథపై నమ్మకంతో తెలుగులో విడుదల చేస్తున్నాం. రిలీజ్ విషయంలో కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. 20ఏండ్లుగా ఇండిస్టీలో ఉంటున్నాం. నాకున్న మంచి పేరుతో మంచి థియేటర్లు దొరికాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలా పోటీ ఉంది. కొందరు రీమేక్ చేయడానికి ఆసక్తి కూడా చూపించారు. కానీ ఫొటోగ్రఫీ, తీసిన విధానం అంత సహజంగా రాదని మేం కూడా అనువాదం చేశాం.
క్రేజీ స్ట్రయిట్ ప్రాజెక్ట్..
నటుడిని కావాలని ఇండిస్టీలోకి వచ్చా. కొన్ని సినిమాలు చేశా. నటుడిగా మనుగడ కష్టమైపోతుందేమో అని రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాను. కానీ కళామతల్లిపై అభిమానం తగ్గలేదు. అందుకే సుఖీభవ మూవీస్‌ను స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నా. మా బ్యానర్లో భారీ సినిమాలు చేయాలనుంది. మంచి కథ ఉన్నా, స్టార్ హీరోలు కాల్షీట్లు ఇవ్వరు. అందుకే కొన్ని రోజుల వరకు డబ్బింగ్ సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే త్వరలోనే స్ట్రెయిట్‌గా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేయబోతున్నాం. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం.