Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ గురించి విస్తృత చర్చ జరుగుతోంది. కాస్టింగ్ కౌచ్‌పై వచ్చిన వివాదాల పరంపర హాలీవుడ్ నుంచి క్రమంగా టాలీవుడ్ వరకొచ్చి ఇప్పుడొక పెద్ద ఉద్యమంగా తయారైంది. అనేక మంది సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో వీటిపై బహిరంగంగానే గళం విప్పుతున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ మరికొంత మందికి ధైర్యాన్నిస్తున్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాస్టింగ్ కౌచ్‌కి సంబంధించి భారీ స్థాయిలోనే చర్చ జరిగింది. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో శ్రీరెడ్డి ఒకరు. అయితే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే టాలీవుడ్‌లోని హీరోలంతా చిరంజీవి ఆధ్వర్యంలో దీనిపై చర్చించడంతోపాటు తమ సినిమాలకు సంబంధించి ఇలాంటివి చోటు చేసుకుంటే, వాటికి హీరోలు కూడా బాధ్యత వహించాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సైతం దీనిపై 'క్యాష్' కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ సమస్యపై భిన్నంగా స్పందించారు.
'ఇది ఒక్క సినిమా రంగంలోనే కాదు, బయట అన్ని రంగాల్లోనూ మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ శాఖల్లోనూ వేధింపుల ఉదంతాలున్నాయి. సినిమా వాళ్ళ వెంటే మీడియావాళ్లు ఎందుకు పరుగెత్తుతున్నారు?, సినిమా రంగంలో రేప్‌లు చేసే మగవాళ్లు బాధితులను వదిలేయడం లేదు. వారికి ఏదో రూపంలో అవకాశాలు కల్పిస్తున్నారు. దీనివల్ల కొంత మందికైనా తిండి దొరుకుతుందన్న విషయం మర్చిపోవద్దు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో అమ్మాయిల నిర్ణయమే కీలకం. వేషాల కోసం మనం ఒకరికి అమ్ముడు పోవాలా?, ఒకరి చేతుల్లో బందీకావాలా? అని ఎవరికి వారే ఆలోచించుకోవాలి. నిజంగా మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు అలాంటి వాటికి ఎందుకు ఒప్పుకోవాలి?. ఇది సినిమా రంగానికి సంబంధించినది కాదు, సమాజానికి సంబంధించనది' అని పేర్కొంది. 'కాస్టింగ్ కౌచ్ మీద కూర్చొవాలా వద్దా? లేకపోతే ఆ కౌచ్‌ని కాళ్ళతో తన్నేయాలా అన్నది పూర్తిగా మహిళా రైట్. కానీ కాస్టింగ్ కౌచ్‌ని సమర్థిస్తూ దానికి ఫేవర్‌గా మాట్లాడితే ఇండిస్టీలో ఉన్న నా చెల్లెళ్ళు, కూతుళ్ళ రైట్ను తగ్గించడమే. వాళ్ళని తక్కువ చేయడమే అవుతుంది' అని కమల్ హాసన్ అన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా మరికొంత మంది సినీ తారలు దీనిపై స్పందిస్తూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరాఠి చిత్రం 'ధగ్'కిగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డునందుకున్న ఉషా జాదవ్ మాట్లాడుతూ, 'నాకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించే ప్రాసెస్‌లో సదరు వ్యక్తి 'డబ్బు గురించి కాదు, నిర్మాత, దర్శకుడు దగ్గర మీరు పడుకోవాలి. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు. నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కొన్ని సార్లు ఇద్దరూ కావచ్చు అంటూ చెప్పడం నన్ను షాక్‌కి గురి చేసింది' అని ఉద్వేగభరితంగా చెప్పారు. అలాగే బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చెబుతూ, 'మహిళలు, పురుషులు కలిసి కట్టుగా ముందుకొచ్చి ఇది జరగకూడదని నిర్ణయిస్తే ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి రావాలి' అని పేర్కొన్నారు.
సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను మరో బాలీవుడ్ నటి రీచా చద్దా సమర్థించారు. 'ఆమె మాటలను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్‌కి మద్దతుగా మాట్లాడారని అనుకోవడం లేదు. ఫిల్మ్ ఇండిస్టీని మాత్రమే ఎందుకు అలా చూస్తున్నారని ప్రశ్నించారు. కానీ ఆమె వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అయితే రేప్ చేయడం అనే పదం వాడటం అభ్యంతరకరంగా ఉంది' అని అన్నారు.
ఓ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ కథానాయికలు కరీనాకపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ ఈ విషయంపై ఆచితూచి స్పందించారు. 'ప్రస్తుతం 'వీర్ ది వెడ్డింగ్' సినిమాపై ఫోకస్ పెట్టాం. ఇది మహిళా సాధికారత గురించి చెబుతుంది. ఈ సందర్భంలో ఇతర విషయాలు గురించి మాట్లాడటం బాగోదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు స్పందిస్తాం' అని చెప్పడం గమనార్హం.
శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ, 'సరోజ్ ఖాన్, రేణుకా చౌదరి మాటలు తప్పుకాదు. లైంగికానందం పొందడం, దాన్ని డిమాండ్ చేయడం ఎంటర్టైన్మెంట్, రాజకీయ రంగాల్లో ఉన్నదే. ఇందులో అంత బాధపడాల్సింది ఏముంది?. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలు ఎలా రాజీపడతారో నాకు తెలుసు. సరోజ్ ఖాన్ కూడా తన జీవితంలో ఇలాంటి అవమానాలు, వేదనలు ఎదుర్కొని ఉంటారు. సినిమాల్లో ఉన్న దాన్ని కాస్టింగ్ కౌచ్ అంటే, రాజకీయాల్లో ఉన్న దానిని కాస్టింగ్ ఓట్ కౌచ్ అనాలేమో. నిజాన్ని మాట్లాడినందుకు సరోజ్‌ను ఖండించకండి. ఆమె మాటలను వక్రీకరించకండి' అని చెప్పారు.