Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిష్టాత్మక కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం చివరి దశకు చేరుకుంది. 12 రోజులపాటు ప్రపంచ సినీ ప్రముఖులందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేలా చేసే ఈ ఫెస్టివల్ 11వ రోజు సైతం ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా సాగింది. వేడుకలు తుది దశకు చేరే ముందు రోజు సైతం కథానాయికలు అబ్బురపరిచే దుస్తులతో, ఎంతో అందంగా ముస్తాబై ఎర్రతివాచీపై సందడి చేశారు. 'ది వైల్డ్ పీయర్ ట్రీ' (అహలాట్ ఎగాసి) చిత్ర ప్రీమియర్‌లో భాగంగా అలెస్సాండ్రా అంబ్రోసియో, ఇసబెలి ఫోంటానా, మార్తా హంట్, ఎలోడీ బౌచెజ్, నీలామ్ గిల్ తదితరులు రెడ్ కార్పెట్‌పై వాక్ చేస్తూ మంత్రముగ్దుల్ని చేశారు. వీరితోపాటు నాహుల్ పెరెజ్ బిస్కాయర్ట్, టాడ్ హార్న్సు, నహీల్ పెరెజ్, ఎల్లోని బోచెజ్, ఆంథోని వాక్కేల్లీ, ఎడ్వర్డ్ లాచ్మాన్, మైఖేల్ పిట్, ఆస్ట్రిడ్ బెర్జ్ తదితర సినీ ప్రముఖులు ప్రీమియర్‌లో పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అదే సమయంలో ఈ చిత్ర ఫొటోకాల్లో చిత్ర బృందంతోపాటు పలువురు సినీ ప్రముఖులైన టర్కీ నటుడు మురాట్ సెమిసిర్, దర్శకుడు నురి బిల్గే సెలైన్, నటుడు అదిన్ డోగు డెమిర్కోల్, నటి ఆసేనా కేస్కిని, మరో నటి హజార్ ఎర్య్కూ, బెన్ను యిల్డిరిమ్లార్ పాల్గొని హల్చల్ చేశారు. మొత్తంగా 11వ రోజు బ్రెజిల్ నటి అలెస్సాండ్రా అంబ్రోసియో ధరించిన జుహైర్ మురాద్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేన్స్‌లో గెలుపెవరిది?
ఇదిలా ఉంటే, కేన్స్ చిత్రోత్సవం శనివారంతో ముగియనుండటంతో ఏ ఏ చిత్రాలకు అవార్డులు వచ్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేసే పనిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ప్రముఖ ఇంగ్లీష్ సినీ విశ్లేషకులు, విమర్శకుడు పీటర్ బ్రాడ్షాస్ తన అనుభవం మేరకు పలు చిత్రాలకు అవార్డులు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆయన ప్రకటించిన దాని ప్రకారం.. గోల్డెన్ పామ్ (ప్లాల్మె డి ఓర్) అవార్డు ఇటాలియన్ డ్రామా చిత్రం 'హ్యాపీ యాజ్ లేజ్జారో' చిత్రానికి వచ్చే ఛాన్స్ ఉందట. ఇలా 'కోల్డ్ వార్' చిత్రానికి గ్రాండ్ ప్రిక్స్ పురస్కారం, 'బర్నింగ్'కు జ్యూరీ ప్రైజ్, 'డాగ్మన్' చిత్ర దర్శకుడు మటెయి గరోన్కి ఉత్తమ దర్శకుడి అవార్డు, 'ది వైల్డ్ పీయర్ ట్రీ' చిత్రానికి పనిచేసిన స్క్రిప్ట్ రైటర్స్ ఎబ్రు క్రెలాన్, అకిన్ అక్సు, నూరి బిల్లే సెలైన్లకు ఉత్తమ స్క్రిప్ట్ అవార్డు, 'బర్నింగ్' చిత్రంలో నటించిన యు ఆV్‌ా ఇన్‌కు ఉత్తమ నటుడి పురస్కారం, 'కోల్డ్ వార్' చిత్ర కథానాయిక జోహన్నా కులిగ్కు ఉత్తమ నటి, 'యాష్ ఈజ్ ప్యూరెస్ట్ వైట్' చిత్రంలో నటించిన లియావో ఫ్యాన్‌కు ఉత్తమ సహాయ నటుడు, 'షాప్లిఫ్టర్'లో నటించిన కిరిన్ కికికు ఉత్తమ సహాయ నటి, 'లెటో' సినిమాకు సంగీతం అందించిన రోమన్ బిలైక్, జెర్మన్ ఎసిపోవ్లు ఉత్తమ సంగీత దర్శకులుగా అవార్డులు వరించే ఛాన్స్ ఉంది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కర్ట్బీచ్(బ్లాక్ఖ్లాన్స్మన్)కు, సినిమాటోగ్రఫీ విభాగంలో హాంగ్ క్యుంగ్ ప్యో(బర్నింగ్)లకు పురస్కారం దక్కే అవకాశం ఉందని పీటర్ బ్రాడ్షాస్ వెల్లడించారు. దీంతో ఇప్పుడంతా అవార్డుల ప్రకటనకు సంబంధించి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తమ్మీద 'బర్నింగ్', 'కోల్డ్‌వార్', 'బ్లాక్ఖ్లాన్స్మన్', 'యాష్ ఈజ్ ప్యూరెస్ట్ వైట్' చిత్రాలు ఎక్కువగా అవార్డులు దక్కించుకునే ఛాన్స్ ఉంది.