Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తల్లిదండ్రుల్ని ఆదరించకుండా వదిలేసే పిల్లలంటే నాకెంతో అసహ్యం. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథ చెప్పినప్పుడు ఈ పాయింట్‌కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. 'నేల టిక్కెట్టు' మాస్‌కి కేరాఫే అయినా బాల్కనీ వాళ్ళని సైతం ఈ సినిమా విజిల్స్ వేయిస్తుంది' అని అంటున్నారు కథానాయకుడు రవితేజ. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవితేజ, మాళవిక శర్మ జంటగా రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం 'నేల టిక్కెట్టు'. ఈనెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో రవితేజ జరిపిన సంభాషణా
విశేషాలు ఆయన మాటల్లోనే..
'నేలటిక్కెట్' టైటిల్‌ని ఎందుకు పెట్టామనే కారణం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటి జనరేషన్ విషయం తెలియదుకానీ ముందు తరం వారందరికీ నేల టిక్కెట్ సుపరిచితమే. ఇప్పటివాళ్ళకి దీని మీనింగే తెలియదు. నా చిన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక టూరింగ్ టాకీస్ ఉండేది. అందులో నేల టిక్కెట్ ధర ఒక రూపాయి పదిపైసలు అది ఏసీ అయితే, నాన్ ఏసీ అయితే తొంభై పైసలు. ఎన్నో సినిమాలు నేల టిక్కెట్‌తోనే చూశాను. నేల టిక్కెట్ అనగానే మాస్ అనేస్తాం.
కానీ బాల్కనీలో కూర్చునే వాళ్ళలో కూడా మాస్ ఉంటారు. అయితే వాళ్ళు ఈల వేయాలంటే చుట్టూ చూసి డిస్ట్రబ్ అవుతుందేమోనని ఆగిపోతారు. కానీ నేల టిక్కెట్లో అలా ఉండదు.. విజిల్స్ మీద విజిల్స్ వేసేస్తారు. ఈ సినిమా విషయానికొస్తే, పక్కనోళ్ళకి డిస్ట్రబ్ అవుతుందని తెలిసినా బాల్కనీ వాళ్ళు సైతం విజిల్స్ వేసేలా ఉంటుంది.
ఇందులో నేనొక అనాథని. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తాను. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ.
వయసు పైబడిన తల్లిదండ్రుల్ని ఆదరించకుండా రోడ్ల మీద, అనాథాశ్రమాల్లో వదిలేసే పిల్లలంటే నాకెంతో అసహ్యం. మన కోసం తల్లిదండ్రులు ఎంతో చేస్తారు. కనీసం జాలి, దయ కూడా లేకుండా వారిని నిర్ధాక్షిణ్యంగా వదిలేయడం కరెక్ట్ కాదు. నిజ జీవితంలో ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు ఎంతో బాధేస్తుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రకథను నెరేట్ చేసిప్పుడు ఈ పాయింట్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. పెద్దవాళ్ళంటే చేతకానీ వాళ్ళు కాదు.. నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ నాకెంతో బాగా నచ్చింది.
బంధాల కోసం, అనుబంధం కోసం సాగే ఎమోషనల్ జర్నీతోపాటు మంచి వినోదం, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, ఆవారాగా తిరిగే నా పాత్ర తీరు తెన్నులు హైలైట్స్‌గా ఉంటాయి. 'ఫిదా' ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ అందించిన సంగీతం చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆయన సౌండింగ్ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈచిత్రం కోసం ఆయన సమకూర్చిన బాణీలు అందర్నీ అలరించాయి.
కొత్త కథ అంటూ ఏదీ ఉండదు. చెప్పే విధానం, చూపించే విధానమే కొత్తగా ఉంటుంది. ఈ సినిమాది కూడా అదే తీరు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి మంచి క్లారిటీ ఉంది. అతని కథలో మాస్‌తోపాటు క్లాస్ కూడా ఉంటుంది. ఈ రెండింటిని స్క్రీన్ మీద చూపించే విధానం బాగుంటుంది. దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు మంచి స్నేహితుడయ్యాడు.
నిర్మాత రామ్ తాళ్లూరికి సినిమాలంటే ప్యాషన్. డబ్బు సంపాదించాలనే యావతో ఇక్కడికి రాలేదు. చాలా మంచి మనసున్న వ్యక్తి. నిజాయితీగా, పాజిటివ్‌గా ఉంటారు. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ఉంది. పైగా ఇటువంటి నిర్మాతలు పరిశ్రమకి ఎంతో అవసరం కూడా.
ఇంతకముందు చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేయడానికి కారణం ఒక్కటే.. అప్పుడు ఏదీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు గ్యాప్ లేకుండా చేయడానికి కారణం.. అన్ని వరుసగా సెట్ అవ్వడమే. నేనేదీ ప్లాన్ చేసుకోను. ఆ టైమ్‌లో ఏదీ వీలుంటే అది చేసుకుంటూ వెళ్లిపోతానంతే.
వీలు కుదిరితే మా అబ్బాయి తప్పకుండా సినిమాల్లో నటిస్తాడు. నేను నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో కూడా తను నటించాల్సి ఉంది. అయితే ఫారెన్ షెడ్యూల్ టైమ్‌లో ఎగ్జామ్స్ కారణంగా నటించట్లేదు.
'రవితేజ సిగ్గులేకుండా నటిస్తాడు' అంటూ ఆడియో వేడుకలో నాపై పవన్‌కళ్యాణ్ విసిరిన పంచ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మొదట్నుంచి ఆయన నాతో ఎంతో స్నేహంగా ఉంటారు. చాలా సరదాగా ఉంటారు. నేనెప్పుడు కలిసినా బాగా మాట్లాడతారు. మా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే.