Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న చిత్రం 'ఆటగదరా శివ'. ఉదరు శంకర్ హీరో. విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా హీరో ఉదరు శంకర్ మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో 'సమయానికి వచ్చేది దేవుడు కాదు, యముడు' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న ఓ ఖైదీ అనుకోకుండా తనను ఉరి తీయాల్సిన తలారినే కలుస్తాడు. వాళ్ళెవరన్న విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలేంటి?, వాళ్ళు ఎవరిని కలిశారనేది సినిమాలో ఆసక్తికరం. హీరోగా నాకిది తొలి చిత్రం. చిన్నప్పట్నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. నా ఊహలకి తగ్గ కథ ఇది. ఖైదీగా కనిపించాలని 11 నెలలు గడ్డెం, మీసాలు పెంచా. దర్శకుడు చేసిన సపోర్ట్‌ని మర్చిపోలేను. నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నన్ను హీరోని చేస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే సినిమాలో అవకాశం ఇచ్చారు. దొడ్డన్న కన్నడలో అగ్రనటుడు. ఆయనతో కలిసి పనిచేయం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరును తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. ఆర్టిస్టుల్లో భావోద్వేగాలను పండించడంలో చంద్ర సిద్ధార్థ్ శైలి వేరు. ఆయన తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులో ప్రత్యేకంగా నిలుస్తుంది' అని అన్నారు. 'జీవితంలో గ్యారంటీ చావుకే ఉంది. అది తెలిసీ కూడా చాలా మంది దాన్నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఒకరినొకరు కలిసినా, విడిపోయినా దాని వెనుక శివుడి లీలే ఉందని నమ్ముతాం. ఆ తాత్వికతని స్పృశిస్తూ అల్లుకున్న కథ ఇది. కన్నడలో విజయం సాధించిన 'రామ రామ రే' అనే చిత్రం ఆధారంగా మన నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దాం. కొత్త దనాన్ని కోరుకునే ప్రేక్షకులను రంజింపచేసే సినిమా అవుతుంది. జులై 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాం' అని దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెలిపారు. దొడ్డన్న, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, దీప్తి కీలక పాత్రధారులు. సంగీతం: వాసుకి వైభవ్, కెమెరా: లవిత్, ఎడిటింగ్: నవీన్ నూలి.