Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం అబ్బాయిలకు ముప్పై ఏండ్లు దాటినా పెళ్ళిళ్ళు కావడం లేదు. సెటిల్ అవ్వాలని వెయిట్ చేయడంతో చివరికి అమ్మాయిలు దొరకడం లేదు. ఈ క్రమంలో పెళ్ళిపై క్లారిటీ ఇచ్చే విధంగా రూపొందించిన చిత్రం 'నా లవ్ స్టోరీ'' అని హీరో మహీధర్ అన్నారు. శివగంగాధర్ దర్శకత్వంలో మహీధర్, సోనాక్షి సింగ్ రావత్ జంటగా నటించిన చిత్రమిది. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మహీధర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'విజయవాడలో పుట్టి పెరిగాను. సివిల్ ఇంజనీర్ పూర్తి చేశా. ఢిల్లీ, హర్యానాలో జాబ్ చేశా. కొన్ని రోజులు మా వ్యాపారాలు చూసుకున్నాను. నాకు స్వతహాగా మోడలింగ్ అంటే ఇష్టం. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చా. నెల రోజుల పాటు నటనలో శిక్షణ, మరో నెల రోజులు డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. మా అమ్మ సాహితీ పబ్లికేషన్స్ నడిపిస్తున్నారు. పబ్లికేషన్స్ ద్వారా సినిమా వాళ్లు పరిచయం. అలా ఈ చిత్ర దర్శకుడు శివగంగాధర్ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. యూత్‌కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగా ప్రేమలో పడేవాళ్ళకి, ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి ప్రేమ,పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చే స్టోరీఇది. గేటెడ్ కమ్యూనిటి నేపథ్యంలో సాగుతుంది. సరదాగా తిరిగే నాకు ఓ అందమైన అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె ప్రేమ కోసం నేను ఏం చేశాననేది సినిమా. నాకు జోడీగా ముంబయికి చెందిన సోనాక్షి సింగ్ రావత్ నటించారు. తను చాలా బాగా నటించింది. దర్శకుడు శివ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ప్రతిభగల దర్శకుడు. డాన్సులు, ఫైట్స్ బాగా వచ్చాయి. సోను రెండు ఫైట్స్ కంపోజ్ చేశారు. వేదనివాస్ సంగీతం సినిమాకు మరో అసెట్. నాలుగు పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. సినిమా షూటింగ్ సాఫీగానే సాగింది. కానీ సినిమాను విడుదల చేయడమే కష్టంగా అనిపిస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. నా తొలి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం 'నటన' అనే మరో సినిమాలో నటిస్తున్నాను. భారతీబాబు దర్శకుడు. సినిమా ఫలితాలకు అతీతంగా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తాం. ఇతర హీరోలతోనూ సినిమాలు చేస్తాం' అని తెలిపారు.