Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమాల్లో కథ, కథనం, ఫైట్స్‌తోపాటు డాన్స్ కూడా కీలకమే. పాటకు అనుగుణంగా డాన్స్ కుదిరితే ఆ పాటలకు విశేష ఆదరణ ఉంటుంది' అని తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో డాన్స్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాన్స్ ఇన్ డాన్స్ ఫిట్నెస్ స్టూడియోను తలసాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సినిమాల్లో డాన్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి ప్రాధాన్యత కలిగిన డాన్స్‌లో యువత శిక్షణ తీసుకోవడం చాలా అవసరం. అలాగే నగర వాతావరణం మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. మన జీవన శైలి ఒత్తిడితో కూడి ఉంటోంది. దీనికి తగినట్టే వ్యాయమాన్ని, అభిరుచిగల వారు డాన్స్‌ను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఫిట్నెస్ స్టూడియోలు ఆరోగ్య కేంద్రాలుగా మారాలి' అని చెప్పారు. 'కొరియోగాఫ్రర్గా చిత్రపరిశ్రమలో నాకు 20 ఏండ్ల అనుభవం ఉంది. సినిమాలకు పని చేస్తూనే డాన్స్ ఫిట్నెస్ స్టూడియోలను నిర్వహిస్తున్నాను. మంత్రి తలసానిగారు మా నూతన డాన్స్ ఫిట్నెస్ స్టూడియోను ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్టూడియోలో డాన్స్‌తోపాటు ఫిట్‌నెస్‌కు ఉపయోగపడే ఏరోబిక్స్, జుంబాలాంటి అనేక నృత్యరీతుల్లో శిక్షణ ఇస్తాం. నిష్ణాతులైన నిపుణులు మా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు' అని మాస్టర్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్3, వినోద్బాలా, కన్నారావు, కొరియోగ్రాఫర్లు సత్య, జానీ, శేఖర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.