Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొత్త హీరోకు ఛాన్స్‌లు రావడం ఎంత కష్టమో, ఓకే చేసిన సినిమా పట్టాలెక్కడం కూడా అంతే కష్టం. ఇందులో ఏదీ ఈజీ కాదు' అని విరాట్ కొండూరి అన్నారు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన చిత్రం 'పరిచయం'. ఈ చిత్రం ద్వారా విరాట్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో ముచ్చటిస్తూ, 'గత ఏడెమిదేండ్లుగా ఆడిషన్స్‌కి వెళ్ళగా ఫైనల్‌గా ఈ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్నాను. మాది చిత్తూరు. నాన్న నరసింహారాజు అప్పట్లో నాటకాల్లో నటించారు. నాక్కూడా స్కూల్లో నాటకాల్లో నటించిన అనుభవం ఉంది. నటనపై ఆసక్తి, సినిమాల్లోకి రావాలనే ఆలోచనకు బీజం పడింది అక్కడే. బెంగుళూరులో థియేటర్స్ చేశా. పదవ తరగతిలో నాకు ఫస్ట్ క్రష్ ఉంది. కాలేజ్‌కి వచ్చేసరికి సుమారు 130 కేజీల బరువుండేవాడిని. ఏ అమ్మాయికి ప్రపోజ్ చేసినా రిజక్ట్ చేశారు. బీబీఎం పూర్తి చేశాక సినిమాల్లో రావాలని దాదాపు రెండేండ్లు కష్టపడి బరువు తగ్గాను. గతంలోనే హీరోగా పరిచయం కావాల్సింది, కానీ అది కుదరలేదు. 'పరిచయం'తో హీరోగా పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది. దర్శకుడు లక్ష్మీకాంత్ తన ఫ్రెండ్ జీవితంలోని సంఘటన ఆధారంగా ఈ ప్రేమ కథా చిత్రాన్ని రాసుకున్నాను. కథ నెరేట్ చేసినప్పుడు నా లైఫ్‌లోని క్రషెస్ గుర్తొచ్చాయి. మూడేండ్ల క్రితమే ఈ కథ విన్నాను. ఆ తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఇందులో నేను ఆనంద్ అనే కుర్రాడిగా కనిపిస్తాను. డీసెంట్‌గా, విలువలు పాటిస్తూ సరదా సరదాగా ఉంటాను. ఓ అమ్మాయి ప్రేమలో పడ్డ్డాక ఆమె ప్రేమ కోసం ఏం చేశాను. కొన్ని పరిస్థితుల కారణంగా ఎలా మారాననేది సినిమా. టీనేజ్ నుంచి మెచ్చ్యూర్డ్ వరకు ప్రేమను తెలిపే హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ ఇది. రెగ్యులర్ లవ్ స్టోరీ అయినప్పటికీ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. హాస్పిటల్ సన్నివేశాలు కట్టిపడేస్తాయి. కథ తరచూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంటుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ సిమ్రత్ చాలా బాగా నటించారు. దర్శకుడు లక్ష్మీకాంత్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. సినిమాకు సంగీతం, విజువల్ హైలైట్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. ఇక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రభాస్ నాకిష్టమైన హీరో. 'ఛత్రపతి', 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాలంటే ఇష్టం. 'డర్', 'బాజీగర్' చిత్రాల్లో షారూఖ్‌లా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రల్లో నటించాలనుంది' అని చెప్పారు.