Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎనిమిదేండ్ల కష్టం తర్వాత తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి' అని అంటున్నారు హీరో రాహుల్ విజరు. ఫైట్ మాస్టర్ విజరు తనయుడు రాహుల్ విజరు హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం రాహుల్ విజరు మీడియాతో ముచ్చటించారు. 'నాన్న( విజరు మాస్టర్) సినిమా రంగంలోనే ఉండడంతో ఆయనతో కలిసి సినిమా షూటింగ్‌లకు వెళ్తుండే వాడిని. చిన్నప్పుడే నన్ను హీరో చేస్తానని నాన్న అన్నారు. ఆయన అలా ఎందుకన్నాడో తెలియదు. ఎనిమిదేండ్లుగా వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నా. మొదట క్లాసిక్ డాన్స్, కూచిపూడి నాట్యం వంటి వాటిలో ప్రావీణ్యం సంపాదించాను. ఆ తర్వాత కరాటే, మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. దేవదాస్ కనకాల, వైజాగ్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. నాన్న షూటింగ్‌లకు వెళ్ళొచ్చాక కొన్నిసార్లు హాయిగా నిద్రపోయేవారు. ఆ రోజు షూటింగ్ బాగా జరిగింది. హీరో బాగా చేశాడని చెబుతుండేవారు. కొన్ని సార్లు బాధపడేవారు. నా విషయంలో అలా బాధపడకూడదని కోరుకునే వారు. ఏ పాత్ర అయినా మనం చేసేలా ఉండాలని చెప్పేవారు. అందుకే అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇప్పించారు. సుకుమార్‌తో మాకు మంచి అనుబంధం ఉంది. ఓ రోజు ఫోన్ చేసి దర్శకుడు రాము గురించి, ఈ కథ గురించి చెప్పారు. మొదట ఆయనే నిర్మిస్తా అన్నారు. కాకపోతే తను 'రంగస్థలం' సినిమా బిజీలో ఉండడంతో మేమే నిర్మించాం. క్యూట్ లవ్ స్టోరీ ఇది. గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఫ్రెండ్స్‌తో తిరిగే కుర్రాడి లైఫ్‌లోకి అమ్మాయి వచ్చిన తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పేంటి, ఎలా బాధ్యతాయుతంగా తయారయ్యాడనేది సినిమా. నేను శ్రీరామచంద్రమూర్తి పాత్రలో కనిపిస్తాను. నాకు రావాల్సిన క్రెడిట్ అంతా రాముడు కొట్టేస్తున్నాడని చంద్రగా పిలిపించుకుంటాను. నా పాత్రను ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకుంటారు. మనింట్లో కుర్రాడిగా భావిస్తారు. హీరోయిన్ కావ్యా థాపర్ చాలా బాగా నటించింది. రాము కొప్పులు అత్యద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సినిమా చూసిన వారి నుంచి మంచి స్పందన లభిస్తుంది. నాన్న సినిమా చూశాక 'ఇది విజయం సాధిస్తుందో లేదో చెప్పలేను, కానీ హీరోగా నువ్ సక్సెస్ అయ్యావురా' అని అన్నారు. 30ఏండ్ల అనుభవం ఉన్న ఆయన అలా చెప్పడం గొప్ప విషయంగానే భావిస్తున్నా. అదే నాకు బెస్ట్ కాంప్లిమెట్. నా వయసు 20ఏండ్లు. ఈ ఏజ్‌లో లవ్ స్టోరీస్ అయితేనే నా బాడీ లాంగ్వేజ్‌కు సూట్ అవుతాయని మొదటి చిత్రం ప్రేమ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకున్నా. యాక్షన్ సినిమాలు ఎప్పుడైనా చేయోచ్చు, వాటిని చేసేందుకు చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. సొంత నిర్మాణంలో సినిమా చేస్తే టెన్షన్ ఉంటుంది. ఈ సినిమా విషయంలో మేం ఒత్తిడిగానే ఫీలవుతున్నాం. నెక్ట్స్ నిహారికతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. రొమాంటిక్ కామెడీ చిత్రమిది. 'పెళ్లిచూపులు' తరహాలో ఉంటుంది. మున్ముందు కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తాను' అని రాహుల్ అన్నారు.