Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్.. బాలనటుడిగా వెండితెరకు పరిచయమై అత్యద్భుతమైన నటనతో విశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్న అగ్రకథానాయకుడు. తాతయ్య నందమూరి తారకరామరావు నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న కథానాయికుడిగా ప్రేక్షకుల్లోనూ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు రెండు దశాబ్దాల సినీ కెరీర్లో 'స్టూడెంట్ నెం.1', 'ఆది', 'సింహాద్రి', 'అదుర్స్', 'బృందావనం', 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' వంటి తదితర చిత్రాలు అఖండ విజయాల్ని సాధించి ఎన్టీఆర్ కెరీర్‌కి మైలురాళ్ళుగా నిలిచాయి. అలాగే భారీ అపజయాలూ ఉన్నాయి. పడి లేచిన కెరటానికి ప్రతీకగా, జయాపజయాలకు అతీతంగా విలక్షణ పాత్రలతో నటనలో మాత్రం అత్యద్భుతమైన పరిణతి సాధించడం విశేషం.
ఇటీవల 'జై లవకుశ' చిత్రంలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో నటన పరంగా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే కథాపరంగా ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్న ఎన్టీఆర్ తాజాగా 'అరవింద సమేత' (వీరరాఘవ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
రాయలసీమకు చెందిన రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన నారపరెడ్డి (నాగబాబు), బసిరెడ్డి (జగపతిబాబు) ఫ్యాక్షన్ గ్రూప్‌లకు నాయకులు. ఈ రెండు వర్గాలు పగ, ప్రతీకారంతో రగిలిపోతుంటాయి. అదను చూసి శత్రువర్గాన్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తుంటాయి. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో నారపరెడ్డి (నాగబాబు)ని బసిరెడ్డి (జగపతిబాబు) చంపేస్తాడు. కళ్ళ ముందే తండ్రిని చంపేయడంతో ఆవేశం కట్టలు తెంచుకున్న వీరరాఘవరెడ్డి (ఎన్టీఆర్) కత్తి పట్టి దొరికినోళ్ళను దొరికినట్టు దారుణంగా చంపేస్తాడు. ఈ గొడవలో తండ్రితోపాటు బాబారుని కూడా వీరరాఘవరెడ్డి పోగొట్టుకుంటాడు. సొంత వాళ్ళను కోల్పోయిన బాధతో ఇంట్లోకి అడుగుపెట్టిన వీరరాఘవరెడ్డికి ఇకపై ఫ్యాక్షన్ గొడవలకు శాశ్వతంగా స్వస్తిపలకమని వాళ్ళ నానమ్మ హితబోధ చేస్తుంది. ఆమె మాటల్లో ఈ గొడవల వల్ల ఆ ఇంటి ఆడవాళ్ళు, ఇంటి పెద్దల్ని నమ్ముకున్న మనుషుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే విషయం వీరరాఘవరెడ్డికి అర్థమవుతుంది. ఇక పై ఫ్యాక్షన్ గొడవలు లేకుండా రెండు ఊర్లని ప్రశాంతంగా ఉంచేందుకు వీరరాఘవరెడ్డి ఏం చేశాడు?, ఈ ప్రయత్నంలో విజయం సాధించాడా లేదా అనేదే మిగిలిన సినిమా.
ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలొచ్చి ఫ్యాక్షన్ తాలూకా విశ్వరూపాన్ని చూపించాయి. ఇదే క్రమంలో పాత్రల రూపంలో కథానాయకుల నట విశ్వరూపాన్ని కూడా వెండితెరపై ఆవిష్కరించాయి. అయితే వీటిల్లో కొన్ని మాత్రం ఫ్యాక్షన్ గొడవలతో జీవితాల్ని నరకం చేసుకునే బదులు శాంతియుతంగా ఉంటే అందరికీ మంచిదనే సందేశంతోనూ రూపొందిన చిత్రాలున్నాయి. ఇలాంటి రొటీన్ ఫ్యాక్షన్ కథతోనే ఈ 'అరవింద సమేత' చిత్రం సైతం రూపొందింది.
వీరరాఘవరెడ్డిగా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని అన్నింటికిమించి ఆయన నటనలోని పరిపక్వతని స్పష్టంగా చూడొచ్చు. సినిమాని ఆసాంతం ఆయన భుజాలపైనే వేసుకున్నారు. కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాల్లో హ్యాట్సాఫ్ చెప్పేలా ఎన్టీఆర్ నటన ఉంటుంది. అలాగే కమర్షియల్ హీరోగా ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్‌ని హైలైట్ చేయడంలోనూ ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రారంభంలో వచ్చే సుదీర్ఘ ఫ్యాక్షన్ దాడి నేపథ్య ఫైట్‌లో సిక్స్‌ప్యాక్‌తో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఆయన అభిమానులకు ఈ సీక్వెన్స్ ఓ పెద్ద ఫెస్టివల్ అనే చెప్పాలి. ఇందులో ముఖ్యంగా ఎర్ర గుడ్డతో మొండికత్తిని చేతికి కట్టుకుని తొడకి రక్తం పూసుకునే షాట్ ఆయన అభిమానులే కాదు ప్రేక్షకుల్ని సైతం బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా ఎన్టీఆర్ ఒన్‌మ్యాన్ షో. తన అద్భుత నటనతో, భావోద్వేగాలతో, హావభావాలతో, అనర్గళంగా రాయలసీమ యాసలో చెప్పే డైలాగ్స్‌తో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదొక ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే చిత్రమని, ఫ్యాక్షన్ వల్ల నష్టపోయిన కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది?, ముఖ్యంగా ఆ ఇంటి ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలను చిత్ర బృందం ప్రమోషన్ ద్వారా ప్రేక్షకులకు ఓ అవగాహన కల్పించింది. అయితే ఎంత అవగాహన కల్పించినప్పటికీ కథాపరంగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతోపాటు త్రివిక్రమ్ సినిమాలో ఉండే వినోదం ఈ చిత్రంలో లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం సీరియస్ మోడ్‌లో సాగడంతో ప్రేక్షకులు దీన్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రెండు ఊర్లలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలని హీరో చేసే ప్రయత్నమూ అలరించదు. అంతేకాదు హీరోయిజాన్ని హైలైట్ చేసేందుకు రూపొందించిన కొన్ని సన్నివేశాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.
ఫైనల్ పంచ్ : ఎన్టీఆర్ తన అత్యద్భుత నటనతో ఎంతగా ప్రేక్షకుల్ని, ఆయన అభిమానుల్ని మంత్రముగ్దుల్ని చేసినప్పటికీ అంచనాల స్థాయిలో ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేక పోయిందీ చిత్రం. స్త్రీ శక్తి, మహిళల సాధికారత చుట్టూ తిరిగే ఈ కథలో వాళ్ళని కేవలం మాటలకే పరిమితం చేయటం బిగ్గెస్ట్ మైనస్. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, పాత్రల తీరు, సన్నివేశాలు నడిచే విధానం ప్రేక్షకులు ఊహించినట్టే ఉండటం, అలరించే లవ్ ట్రాక్ లేకపోవడం, శ్రుతి మించిన హింస, రక్తపాతం వంటి అంశాలు ప్రధాన లోపాలు. అయితే సంభాషణల పరంగా త్రివిక్రమ్ మరోమారు తన కలం సత్తాని చాటారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. ఎక్కువ హాలీడేస్ ఉన్న దసరా వంటి పెద్ద పండగ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కావడం కలెక్షన్ల పరంగా ఢోకా ఉండదు. అలాగే ఓవర్సీస్లోనూ విపరీతమైన కలెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తమ్మీద తన నట విశ్వరూపంతో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసినప్పటికీ ఫర్వాలేదనే ఫలితాన్ని మాత్రమే ఈ చిత్రం రాబట్టుకోగలిగింది.