Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్ సిద్ధార్థ్, నివేదా థామస్ జంటగా నూతన దర్శకుడు కిషన్ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'శ్వాస'. శ్రీ తేజ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ పతాకాలపై తేజ్ ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో శర్వానంద్ క్లాప్ నివ్వగా, సీనియర్ నరేష్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, 'ఇటీవల విన్న కథల్లో బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది. అందుకే చాలా సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రాన్ని చేస్తున్నా. క్యారెక్టర్ చాలా బాగా ఉంటుంది. పాత్ర తీరుతెన్నులు అందంగా ఉంటాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నాకు లక్కీ పర్సన్. ఇప్పుడు మరో యువ ప్రతిభాశాలి కిషన్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి సినిమాలు చేసే ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న మరో మంచి సినిమా ఇది' అని అన్నారు. 'ఈ సినిమా నా హృదయానికి బాగా దగ్గరైనది. ఇది నా లైఫ్‌కే కాదు, అందరి జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది' అని నివేదా థామస్ తెలిపారు. దర్శకుడు కిషన్ చెబుతూ, 'ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీ. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా సాగుతుంది. చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చేయడానికి ఒప్పుకున్న నిఖిల్, నివేదాలకు థ్యాంక్స్' అని చెప్పారు. నిర్మాత తేజ్ చెబుతూ, 'హరినికేష్, కిషన్, నేను చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులం. మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం' అని చెప్పారు. 'డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నాం' అని మరో నిర్మాత, సంగీత దర్శకుడు హరినికేష్ తెలిపారు.