Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్.. ఎనర్జిటిక్ హీరోగా పరిశ్రమలో ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న యువకథానాయకుడు. వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవదాసు' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. విశేష ప్రేక్షకాదరణతో తొలి చిత్రమే ఘన విజయం సాధించింది. అలాగే నటుడిగా రామ్‌ని ప్రేక్షకులకు చేరువ చేసింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించిన 'జగడం' ఆశించిన స్థాయిలో విజయాన్ని రాబట్టలేకపోయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన 'రెడీ' చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని రామ్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా ఆయనకు పరిశ్రమలో గుర్తింపు తీసుకురావడానికి ఈ చిత్రం బాగా దోహదపడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
'మస్కా', 'గణేష్', 'రామ రామ కృష్ణ కృష్ణ' వంటి వరుస ఫెయిల్యూర్స్‌తో రామ్ కెరీర్ ఒడిదుడుకుల్లో పడింది. వీటి తర్వాత 'కందిరీగ' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రామ్‌ని మళ్ళీ సక్సెస్‌బాటలో పయనించేలా చేసినప్పటికీ 'ఎందుకంటే ప్రేమంట', 'ఒంగోలు గిత్త', 'మసాల', 'పండగ చేస్కో', 'శివం' వంటి తదితర ఐదు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫెయిలై మరోసారి రామ్ కెరీర్ గ్రాఫ్‌ని డౌన్‌ఫాల్ అయ్యేలా చేశాయి.
జయాపజయాలకు అతీతంగా కథలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ కోసం రామ్ చేసిన ప్రయత్నానికి 'నేను శైలజా', 'హైపర్' చిత్రాలు సక్సెస్‌ని అందించాయి. వీటి తర్వాత నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం ప్రేక్షకుల నిరాదరణతో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో తాజాగా 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రంతో రామ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.
సంజూ (రామ్) బీటెక్ పూర్తి చేసినప్పటికీ ఏ పనీ చేయకుండా స్నేహితులతో ఆవారాగా తిరుగుతుంటాడు. మావయ్య (పోసాని మురళీకృష్ణ) చేసిన హితబోధతో రియలైజ్ అయ్యి జాబ్ చేసేందుకు కాకినాడ నుంచి హైదరాబాద్‌కి ట్రైన్లో బయలుదేరతాడు. ఈ ట్రైన్ జర్నీలో అనుపమా (అనుపమా పరమేశ్వరన్)ను టీజ్ చేస్తాడు. సంజూ చేసిన టీజ్కి అనుపమా హర్ట్ అవుతుంది. హైదరాబాద్‌లో తన తల్లి (సితార) స్నేహితుడైన విశ్వనాథ్ (ప్రకాష్‌రాజ్) ఇంటికి సంజూ వస్తాడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత విశ్వనాథ్ కూతురే అనుపమా అని తెలుసుకుని సంజూ షాక్ అవుతాడు.
సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ కోసం ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు రీతూ (ప్రణీత)ని చూసి రామ్ ప్రేమలో పడతాడు. రీతూ కూడా సంజూని ఇష్టపడుతుంది. ఓ రోజు సంజూకి రీతూ లవ్ ప్రపోజ్ చేస్తుంది. అయితే రామ్ తనకి తెలియకుండానే అనుపమా ప్రేమలో పడిపోతాడు. ఇదే విషయాన్ని రీతూకి చెప్తే ఆమె హర్ట్ అయి వెళ్ళిపోతుంది. అనుపమాకి తన ప్రేమ గురించి సంజూ చెప్పాలనుకుంటాడు. కానీ అప్పటికే తన ఆఫీస్‌లో పని చేసే కార్తీక్ (నోయల్)తో అనుపమా పెళ్ళిని విశ్వనాథ్ ఖాయం చేస్తాడు. తన కూతురికి ది బెస్ట్ భర్తని ఇవ్వబోతున్నానని విశ్వనాథ్ గర్వపడుతుంటాడు. ఏం చేయాలో పాలుపోని తరుణంలో అనుపమాని తాను ప్రేమిస్తున్నట్టు విశ్వనాథ్‌కి సంజూ చెబుతాడు. నెల రోజులు తనతో స్నేహం చేసి, తాను కార్తీక్ కంటే బెస్ట్ అయితేనే తన కూతురికి ఇచ్చి పెళ్ళి చేయమని విశ్వనాథ్‌ని అడుగుతాడు. సంజూ అడిగినట్టు విశ్వనాథ్ నెల రోజులు ఫ్రెండ్‌గా ఉండేందుకు అంగీకరిస్తాడు. ఈనెల రోజుల్లో ఏం జరిగింది?, అనుపమా కూడా సంజూని ప్రేమించిందా లేక తండ్రి చెప్పిన పెళ్ళే చేసుకుందా?, లేదా సంజూ తాను అనుకున్నట్టు అనుపమాని పెళ్ళి చేసుకున్నాడా వంటి తదితర ప్రశ్నల సమాహారంగా ఈ చిత్రం సాగుతుంది.
కథాపరంగా ఇదేం కొత్త కథ కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు వెంకటేష్, ఆర్తీఅగర్వాల్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్ర కథ మదిలో మెదులుతుంటుంది. దీంతో కొత్త సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ఉండదు. ఈ సినిమా విషయానికొచ్చే సరికి ప్రధమార్థంలో పాత్రల పరిచయం, సంజూ, రీతూల లవ్ ట్రాక్ కామెడీతో సరదాగా సాగిపోతుంది. బలమైన కాన్ఫ్లిక్ట్ లేకుండానే ప్రారంభమైన ద్వితీయార్థం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. వచ్చిన సన్నివేశాలే డైలాగులు మారుతూ మళ్ళీ మళ్ళీ రావడంతో ప్రేక్షకులకు విసుగొస్తుంది. దీనికితోడు పాత్రలు మాట్లాడే డైలాగులతోపాటు రాబోయే సన్నివేశాలు కూడా ఎలా ఉంటాయో ప్రేక్షకులు ఊహించినట్టుగానే వస్తుండటంతో సినిమా మరీ బోర్ కొట్టిస్తుంది. సంజూ, విశ్వనాథ్‌ల మధ్య సాగే ఫ్రెండ్షిప్ ప్రేక్షకులను కొంత మేరకు అలరించినప్పటికీ అంతిమంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోదు. అలాగే వీరిద్దరి మధ్య సాగే సంభాషణల పర్వం టూ మచ్ ఓవర్ డ్రామా ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. అక్కడక్కడ బాగా నవ్వుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనాలు లేకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచిందీ చిత్రం.
ఆవారాగా, సిన్సియర్ ప్రేమికుడిగా, సిన్సియర్ స్నేహితుడిగా తన పాత్రలోని భిన్న కోణాలకు సంజూగా రామ్ పూర్తి న్యాయం చేశాడు. తన పాత్ర పరిధిమేరకు ఎంత వినోదానికి ఆస్కారం ఉందో అంతకంటే ఎక్కువ వినోదం రావడానికి నటన పరంగా రామ్ చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు.
ఫైనల్ పంచ్ : 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం తర్వాత దిల్‌రాజుతో రామ్ చేసిన రెండో చిత్రం కావడం, దసరా వంటి పెద్ద పండగ నేపథ్యంలో విడుదలవుతుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకునే క్రమంలో ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. నటన పరంగా రామ్, ప్రకాష్‌రాజ్ ది బెస్ట్ ఇచ్చినప్పటికీ రొటీన్ కథ, బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, బలహీన క్లయిమాక్స్‌లు ఈ చిత్రానికి అతి పెద్ద లోపాలుగా నిలిచాయి. రొటీన్ కథని ఎంచుకుని రామ్, నిర్మాత దిల్‌రాజు మిస్టేక్ చేశారని ఈ చిత్ర ఫలితం చెప్పకనే చెప్పింది. దీంతో రొటీన్‌గానే ఫ్లాప్ సినిమా గురూ అని ప్రేక్షకులతో అనేలా చేసింది. రామ్, దిల్ రాజునే కాదు దర్శకుడు త్రినాథరావు నక్కిన కూడా రోటీన్ నుంచి బయట పడకపోతే ఫ్లాపుల్ని ఖాతాలో వేసుకోవాల్సి వస్తుంది.