Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరవింద సమేత'లోని నా పాత్ర ఈ స్థాయిలో పండుతుందని ఊహించలేదు. ఓ రకంగా ఇది పీక్. ఇకపై దర్శకులు నాకు ఎలాంటి పాత్రలు ఇస్తారనేది చూడాలి. నేను ఏం చేస్తాననేది మాత్రం నాకు తెలియదు' అని అంటున్నారు జగపతిబాబు. తాజాగా ఆయన ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అరవింద సమేత'లో విలన్‌గా నటించారు. విడుదలైన సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో జగపతిబాబు శనివారం మీడియాతో ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ, 'సినిమాలో నా పాత్రకు ఇంత మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర ఇంత హైలైట్ అవుతుందని ఊహించలేదు. ఈ విషయంలో త్రివిక్రమ్, హీరో తారక్ ప్రోత్సాహమే ప్రధాన కారణం. ప్రతినాయకుడి పాత్ర స్ట్రాంగ్‌గా ఉండాలని ఒక టాప్ హీరో ప్రోత్సహించడం ఈజీ కాదు. కానీ తారక్ ఆ పని చేశాడు. ఇందులో ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి పాత్రకు నటన పరంగా కంటే డబ్బింగ్ విషయంలో చాలా కష్టపడ్డాను. ఒకానొక దశలో గొంతు పోతుందేమో అనిపించింది. ఎమోషనల్‌గా డైలాగ్స్ చెప్పే క్రమంలో కళ్లు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చింది. గొంతుపోయినా ఫర్వాలేదు దాన్ని అంతే ఎమోషనల్‌గా చెప్పాలని డిసైడ్ అయ్యా. అందుకు పప్పు, పెంచలదాస్ బాగా సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలంటే నాకు స్ట్రాంగ్ పాయింట్, అసెట్ నా డబ్బింగ్. సెట్లో అది కనిపించదు, కానీ తెరపై అది డబుల్ అవుతుంది. ఈ విషయం మొదటిసారి చెబుతున్నా. ఇటీవల ఓ వ్యక్తి కలిసి ఇప్పటి వరకు జగపతిబాబు అంటే తెలియదు.
ఈ సినిమా చూశాక మీరేంటో తెలిసిందన్నారు. అది విని 'ఏంటీ ఇన్ని సంవత్సరాలు ఎన్నో సినిమాలు చేశా. ఇంకా నేను తెలియదా?' అనిపించింది. ఈ సినిమాతో అందరికి తెలిసినందుకు హ్యాపీగా ఉంది. ఎలాగైనా హిట్ కొట్టాలని త్రివిక్రమ్ కసితో పనిచేశాడు.
అది తెరపై వర్కౌట్ అయ్యింది. బేసిక్‌గా నేను వైలెంట్ పర్సన్‌ని కాదు. క్లాస్‌గా ఉండే పాత్రలనే ఇష్టపడతా. కానీ గతంలో 'గాడ్ ఫాదర్' లాంటి సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు మాత్రం క్లాస్ పాత్రలు చేయాలనిపిస్తుంది.
ఇటీవల 'గూఢచారి'లో టెర్రరిస్ట్‌గా, 'రంగస్థలం'లో ప్రెసిడెంట్‌గా, ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్‌గా చేశా. చేయడానికి ఇంకా ఏం ఉంటుందనిపిస్తుంది. ఇకపై దర్శకులు నాకు ఎలాంటి పాత్రలు ఇస్తారో చూడాలి. నాకు పార్లల్్, ఆర్ట్ సినిమాలు చేయాలని ఉంది. ఇప్పుడు నాకు డబ్బు కంటే మనసు సంతృప్తి ముఖ్యం. 'లెజెండ్' సినిమాలు చేసే టైమ్‌లో నేను విలన్‌గా నటించడమేంటి, ఎందుకు నాకీ పరిస్థితి అని రాత్రిళ్ళు బోరున ఏడ్చేవాడిని. కానీ నాకప్పుడు మరో ఛాయిస్ లేదు. కొందరేమో ఇంటలిజెంట్ నిర్ణయం తీసుకున్నావన్నారు. నిజం చెప్పాలంటే హీరోగా కంటే ఇప్పుడే నటుడిగా ఈ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నా. విలక్షణ పాత్రలు చేయగలుగుతున్నా. నటులుగా ప్రకాష్‌రాజ్, నానా పటేకర్ నటనను ఇష్టపడతా. వారిలా చేయాలనుకున్నాను. నటనకు, భాషకు బారియర్స్ లేవు. ఏ భాషలోనైనా నటించవచ్చు. నాకు ఇండియాలోని అన్ని భాషల్లో నటించాలనుంది. హిందీలోనూ ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం 'సైరా'తోపాటు అజిత్‌తో ఓ సినిమా, సూర్య సినిమా, విజయ్ చిత్రం, మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నా. 'సైరా'లో చిరంజీవి పక్కన ఉండే పాత్ర. మంచి, చెడు ఉన్న పాత్ర నాది. మంచి పాత్రలు వస్తే వెబ్ సిరీస్ కూడా చేస్తా. దానికి మంచి ఫ్యూచర్ ఉంది. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఇంకా ఏదో చేయాలనే తపన కనిపిస్తుంది. ఇది మంచి పరిణామం. ప్రొడక్షన్ చేసే ఆలోచన లేదు. నేను నిర్మాతగా పనికిరాను' అని చెప్పారు.