Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మన్యంపులి', 'జనతా గ్యారేజ్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్‌లాల్ తాజాగా 'ఒడియన్' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ చిత్రాన్ని దగ్గుపాటి క్రియేషన్స్ పతాకంపై రామ్ దగ్గుపాటి, సంపత్‌కుమార్‌లు తెలుగులో ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఇటీవల చిత్ర తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం మోహన్‌లాల్ చాలా కష్టపడ్డారు. తన 55 ఏండ్ల వయసులోనూ యోగాసనాలు, వ్యాయామాలు చేసి 35ఏండ్ల వ్యక్తిలా కనిపించేలా తన శరీరాన్ని మార్చుకోవడం విశేషం. ఇందులో ఆయన పలు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. దర్శకుడు శ్రీకుమార్ ఆయన్ని 35ఏండ్ల వ్యక్తిగా చూపించిన తీరు, పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ పక్కా కమర్షియల్ ప్యాక్‌గా తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌తో సినిమాపై క్రేజ్ పెరిగింది. దక్షిణాదిలోనే భారీ క్రేజ్ నెలకొంది. ఇంతటి అవకాశాన్ని అందించిన మోహన్లాల్కి, నిర్మాతలకు థ్యాంక్స్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మలయాళంతోపాటు తమిళం, తెలుగులో ఈ శుక్రవారం విడుదల కానుంది' అని అన్నారు.