Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ హీరోహీరోయిన్లుగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అంతరిక్షం' (9000కేఎమ్‌పీహెచ్). ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఆదివారం వైభవంగా జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, 'ఈ ప్రయత్నం ఓ అద్భుతం. 'ఘాజి' లాంటి సినిమా తర్వాత సంకల్ప్‌రెడ్డి ఎలాంటి సినిమా చేస్తాడో అనుకున్నా. కానీ అంతరిక్షంపై సినిమా చేయడం గొప్ప విషయం. 1500 సీజీ షాట్స్ ఉన్న సినిమాను ఇంత త్వరగా రిలీజ్ చేయడం మరో గొప్ప విషయం. ఆయన్ని మేమంతా ఫాలో అవ్వాలి. సంకల్ప్లా ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా చేయొచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఈ నిర్మాతలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొత్తదనం తెచ్చే సంకల్ప్ లాంటి డైరెక్టర్లు ఇండిస్టీకి రావాలి. ఆడియెన్స్, మీడియా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. జనంలోకి తీసుకెళ్ళాలి. వరుణ్ మా ఫ్యామిలీలో ఓ డైమండ్. తను చాలా సెలక్టీవ్‌గా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అల్లు అరవింద్ చెప్పారు. 'కథ నమ్మి సినిమా చేసిన హీరో వరుణ్‌కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా హిట్ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. సినిమాలో నాపేరు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. పనిచేసిన అందరి వర్క్ చూసి మంచి అనుభూతి కలిగింది. ఇలాంటి విభిన్న కథలు ఒప్పుకుని వరుణ్ ఇంకా మంచి సినిమాలు చేయాలి' అని చిత్ర నిర్మాత క్రిష్ చెప్పారు.
హీరో వరుణ్‌తేజ్ చెబుతూ,'సినిమా ట్రైలర్ అందరికి నచ్చుతుంది. రిలీజ్ తర్వాత సినిమా గురించి అంతా మాట్లాడుకుంటారు. అందరం కష్టపడి ఓ డిఫరెంట్ సినిమా చేశాం' అని చెప్పారు. 'ఈ నెల 21న సినిమా విడుదల కాబోతుంది. ఇలాంటి సినిమా ఎప్పుడో ఓసారి వస్తుంది. సినిమాలో 1500 సీజీ షాట్స్ ఉన్నాయి. అంతా ముంబయిలో వర్క్ చేస్తున్నారు. విడుదలయ్యాక సినిమా చూసి ఆడియెన్స్ అమేజింగ్‌గా ఫీల్ అవుతారు. 'ఘాజి' కంటే ఎక్కువ ప్రెజర్ ఈ సినిమాపై ఉంది' అని చిత్ర దర్శకుడు సంకల్ప్‌రెడ్డి చెప్పారు. హీరోయిన్ అదితిరావు హైదరీ చెబుతూ,' తెలుగులో నాకిది రెండో సినిమా. ఇక్కడి వాతావరణం, ప్రజలు బాగా నచ్చారు. ఒక మంచి సినిమా రాబోతుంది. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉంది' అని చెప్పారు. మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి చెబుతూ,'ఇందులో నేను పార్వతి పాత్రలో కనిపిస్తాను. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నన్ను ఎంపిక చేసిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు' అని చెప్పారు.