Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు అరడజనుకుపైగా ఇతర భాషా చిత్రాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి. వాటిల్లో 'క్వీన్' గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కంగనారనౌత్ ప్రధాన పాత్రధారిణిగా బాలీవుడ్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రీమేక్ చేయడం విశేషం. తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పేరుతో తమన్నా ప్రధాన పాత్రధారిణిగా రూపొందిస్తున్నారు. దీనికి నీలకంఠ, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.
తెలుగులో రీమేక్ అవుతున్న మరో చిత్రం '96'. విజరు సేతుపతి, త్రిష జంటగా సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కి తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రమిది. తాజాగా శర్వానంద్, సమంత జంటగా తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. మాతృక దర్శకుడే ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కన్నడలో కూడా '99' పేరుతో గణేష్, భావన జంటగా రీమేక్ కాబోతోంది.
గతేడాది 'యూటర్న్' రీమేక్‌లో నటించిన సమంత ప్రస్తుతం 'మిస్‌గ్రానీ' అనే సౌత్ కొరియన్ చిత్ర రీమేక్‌లో నటిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఓ బేబీ' (ఎంత సక్కగున్నావే) అనే టైటిల్ వినిపిస్తుంది. అక్కడ ఈ సినిమా కేవలం 3.2 మిలియన్ డాలర్లతో తెరకెక్కి, 52 మిలియన్ డాలర్లని వసూలు చేసి సంచలన విజయం సాధించింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఏబీసీడీ' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వంలో కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. తెలుగులో రీమేకైన సినిమాను మార్చి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిఖిల్ నటిస్తున్న 'అర్జున్ సురవరం' సైతం తమిళంలో విజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ 'కణిథన్' రీమేక్‌గా తెరకెక్కుతున్నదే. అలాగే గతేడాది తమిళంలో అందరి చూపులను తనవైపు తిప్పుకున్న చిత్రం 'రాట్ససన్'.
విష్ణు విశాల్ హీరోగా రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దీన్ని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. దీనికి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారట.
ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న వరుణ్‌తేజ్ తాజా చిత్రం కూడా తమిళంలో మంచి విజయం సాధించిన 'జిగర్తాండ' చిత్రానికి రీమేక్ అని సమాచారం. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'టైగర్ జిందా హై' కూడా తెలుగులో రీమేక్ కాబోతుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. గోపీచంద్, తమన్నా జంటగా రీమేక్ చేయబోతున్నారట. హిందీలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై నేపథ్య యాక్షన్ ఎంటర్టైనర్ సుమారు 500 కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
దీంతోపాటు మరో బాలీవుడ్ హిట్ చిత్రం 'సోను కే టిటు కి స్వీటీ' చిత్రాన్ని అల్లు అర్జున్ నిర్మాతగా తెలుగులో రీమేక్ చేయబోతున్నారని సమాచారం. అలాగే ఇటీవల బాలీవుడ్లో మంచి విజయం సాధించిన 'గల్లీబారు' చిత్రాన్ని తెలుగులో సాయిధరమ్ తేజ్ హీరోగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
పలు భాషల్లోకి పరభాషా చిత్రాల రీమేక్
బాలీవుడ్లో భారీ విజయం సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకున్న 'పింక్' చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విద్యా బాలన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక 'క్వీన్' చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో కాజల్ లీడ్ రోల్‌గా 'పారిస్ పారిస్', కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్రధారిణిగా 'బట్టర్ఫ్లై', మలయాళంలో మంజిమా మోహన్ ముఖ్య పాత్రలో 'జామ్ జామ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న '7/జి బృందావన కాలనీ' చిత్రాన్ని సంజరు లీలా భన్సాలీ నిర్మాతగా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. రాఘవ లారెన్స్ రూపొందించిన బ్లాక్ బస్టర్ 'కాంచన' చిత్రాన్ని హిందీలో అక్షరు కుమార్ హీరోగా రీమేక్ చేయనున్నారు.
హిందీలో సూపర్ హిట్ అయిన 'అంథాధున్'ని తమిళంలో సిద్ధార్థ్ హీరోగా రీమేక్ చేయనున్నారట. తమిళ బ్లాక్‌బస్టర్ 'విక్రమ్ వేదా'ని సైతం హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
బాలీవుడ్లో రీమేక్ అవుతున్న విదేశీ చిత్రాలు
సౌత్ కొరియా సినిమా 'ఒడె టు మై ఫాదర్' చిత్రాన్ని హిందీలో సల్మాన్ హీరోగా 'భారత్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. దీంతోపాటు మరో సౌత్ కొరియన్ చిత్రం 'వెటరన్' రీమేక్‌లోనూ సల్మాన్ నటించనున్నట్టు తెలుస్తోంది. 2016లో స్పానిష్‌లో ఘన విజయం సాధించిన 'కాంట్రాటీయెంపో' సినిమాని హిందీలో 'బద్లా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా సుజరు ఘోష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి సహ నిర్మాతగా షారూఖ్ ఖాన్ వ్యవహరించడం విశేషం.
రీమేక్స్‌లో సక్సెస్ ఎంత?
గత రెండు దశాబ్దాల్లో 'ఠాగూర్' (తమిళం: రమణ), 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' (హిందీ : మున్నాభారు ఎంబీబీఎస్), 'శంకర్‌దాదా జిందాబాద్' (హిందీ : లగే రహో 'మున్నాభారు)', 'గబ్బర్ సింగ్' (హిందీ : దబాంగ్), 'ప్రేమమ్' (మలయాళం : ప్రేమమ్), 'దృశ్యం' (మలయాళం: దృశ్యం), 'గురు' (తమిళం : ఇరుదు సుట్రు), 'ఖైదీ నంబర్ 150' (తమిళం: కత్తి) వంటి తదితర కొన్ని చిత్రాలు మాత్రమే విజయాలు సాధించాయి. సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలే రీమేక్ అవుతున్నప్పటికీ ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉన్నాయనేది వాస్తవం. ప్రాంతీయతకు తగ్గట్టు నేటివిటీలో సరైన మార్పులు చేయకపోవడం, ఆడియెన్స్‌ని కన్వీన్స్ చేసేలా మేకింగ్ లేకపోవడం, సరైన కాస్టింగ్‌ని ఎంపిక చేయకపోవడం, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కథ కావడం, రీమేక్స్‌లో ఫ్రెష్‌నెస్ లేకపోవడం వంటి తదితర కారణాలతో రీమేక్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయని దర్శక, నిర్మాతలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.