Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానికి తగ్గట్టుగానే అన్ని సినీ పరిశ్రమల్లోనూ ట్రెండ్స్ మారిపోతుంటాయి. ప్రస్తుతం సర్వత్రా రీమేక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇందులో భాగంగా భాషతో నిమిత్తం లేకుండా అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు బోల్డెన్ని సినిమాలు రీమేక్స్ అవుతున్నాయి. రీమేక్స్ల సక్సెస్ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ అన్ని భాషా చిత్ర దర్శక, నిర్మాతలు వీటిపై మక్కువ చూపటం విశేషం. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి ఇతర భాషల్లోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి, పలు భాషల్లోకి ఇతర భాషా చిత్రాలతోపాటు బాలీవుడ్లో రీమేక్
అవుతున్న విదేశీ చిత్రాల గురించి సవివరంగా 'నవచిత్రం' పాఠకుల కోసం...
ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి. వాటిలో ప్రధానంగా 'టెంపర్' చిత్రం ఒకటి. ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రమిది. ఇటీవల హిందీలో 'సింబా' పేరుతో రణ్వీర్ సింగ్ హీరోగా రీమేకై భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.200కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. అలాగే తమిళంలోనూ విశాల్ హీరోగా 'అయోగ్య' పేరుతో రీమేక్ అవుతోంది. నూతన దర్శకుడు వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. భారీ హంగులతో తమిళ నేటివిటికి తగ్గట్టుగా రీమేక్ అవుతున్న ఈచిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది.
గతంలోనూ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలన విజయం సాధించిన 'బద్రి' సినిమా హిందీలో 'షార్ట్ : ది ఛాలెంజ్ టైటిల్‌తో, 'పోకిరి' చిత్రం తమిళంలో విజరు హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో 'పొక్కిరి'గా, హిందీలో సల్మాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో 'వాంటెడ్'గా , కన్నడలోనూ దర్శన్ హీరోగా, ఎండీ శ్రీధర్ దర్శకత్వంలో 'పొర్కి' టైటిల్‌తో రీమేకై మంచి విజయాలు సాధించాయి.
పవన్‌కళ్యాణ్, తివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'అత్తారింటికి దారేదీ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈచిత్రాన్ని సుదీప్ హీరోగా కన్నడలో 'అన్న'గా, బెంగాలీలో 'అభిమాన్'గా రీమేక్ చేశారు. ఈ రెండూ ఆయా భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ తమిళంలో శింబు హీరోగా 'వంతా రాజవతన్ వరువేన్' పేరుతో రీమేకై డిజాస్టర్‌గా నిలవడం గమనార్హం.
పాత్ బ్రేకింగ్ తెలుగు సినిమాగా అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల ప్రశంసలతోపాటు కలెక్షన్ల సునామీ సృష్టించిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం కూడా పలు భాషల్లోకి రీమేక్ అవుతోంది. విజరు దేవరకొండను ఓవర్‌నైట్ స్టార్ హీరోని చేసిన ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా మాతృక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. అలాగే తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రీమేక్ చేశారు. దీనికి 'వర్మ' అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు. అయితే ఫస్ట్‌కాపీ చూసిన నిర్మాతలు అవుట్‌ఫుట్‌తో సంతృప్తి చెందక పోవడంతో హీరో మినహా మిగిలిన వాళ్ళందరినీ కొత్తగా ఎంపిక చేసి రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. రీమేక్‌ల హిస్టరీలో ఓ పూర్తి సినిమాని రీషూట్ చేయడం ఇదే ప్రధమం. 'తెలుగునాట సంచలన విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని అదే స్థాయిలో తెరకెక్కించకపోతే దాని విలువను, గౌరవాన్ని చెడగొట్టినవాళ్ళం అవుతాం. అందుకే మా 'వర్మ' చిత్రాన్ని పూర్తిగా రీషూట్ చేస్తున్నాం' అని ప్రకటించిన నిర్మాతల ధైర్యానికి, రాజీపడని తనానికి, సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్‌ని చెబుతోంది.
గతేడాది తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం 'ఆర్ ఎక్స్ 100'. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన ఈ చిత్రానికి అజరు భూపతి దర్శకత్వం వహించారు. దీన్ని తమిళంలో ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ చేస్తున్నారు. తాప్సీ కథానాయికగా నటించే అవకాశం ఉన్న ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌నే క్యారీ చేసే ఛాన్సూ ఉందట. అలాగే ఈ చిత్రాన్ని హిందీలో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా సాజిద్ నడియడ్వాలా రీమేక్ చేస్తున్నారు.
విజరు దేవరకొండ నటించిన మరో బ్లాక్ బస్టర్ 'గీతగోవిందం' కూడా రీమేక్ కాబోతుంది. విశేష ప్రేక్షకాదరణతో వంద కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రాన్ని హిందీలో ఇషాన్ ఖత్తర్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. దీంతోపాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా, వాణి కపూర్ కథానాయికగా రీమేక్ చేయబోతున్నట్టు మరో వార్త వినిపిస్తోంది. విజరు దేవరకొండ నటించిన 'పెళ్ళిచూపులు' చిత్రాన్ని సైతం తమిళంలో విష్ణు విశాల్, తమన్నా జంటగా గౌతమ్ మీనన్ రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే 'పెళ్ళిచూపులు' సినిమా ఇప్పటికే హిందీలో 'మిత్రన్' పేరుతో జాకీ భగ్నాని, కృతిక కమ్రా జంటగా రీమేకై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అలాగే మలయాళంలో 'విజరు సూపరమ్ పౌర్నమియుమ్' పేరుతో ఇటీవల రీమేకై భారీ విజయాన్ని సాధించింది. వీటితోపాటు విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాలు సాధించిన 'ఎఫ్2', 'హుషారు', 'టాక్సీవాలా' చిత్రాలను హిందీ, తమిళ భాషల్లోకి రీమేక్ చేసేందుకు ఆయా చిత్ర పరిశ్రమల దర్శక, నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మన తెలుగు చిత్రాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవ్వడమనేది సంతోషించదగ్గ విషయమని వేరే చెప్పక్కర్లేదు.