Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందిత శ్వేత ప్రధాన పాత్రధారిణిగా బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ సంయుక్తంగా 'అక్షర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని 'అసులదర..నిశలు చెదర.. అక్షరాన్ని శిఖలు ఎగసి ఆగ్రహించెలె..' అంటూ సాగే పాటని విడుదల చేశారు.
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ పాటకి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలియజేస్తూ, 'ప్రస్తుతం విద్య వ్యాపారం కావడంతో తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మకపు సరుకుగా మారిన కార్పొరేట్ విద్యా విధానంలో మార్పు రావాలంటూ ఓ యువతి గళమెత్తింది. వివేకాన్ని ఇవ్వాల్సిన విద్య వ్యాపారంగా మారితే అది ఎంత దారుణంగా ఉంటుందో అందరికి తెలిసిందే. తెలిసి కూడా ఉదాసీనంగా ఉండేవారిని సైతం ప్రశ్నిస్తూ అక్షర అనే యువతి సాగించిన పోరాట నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించాం. తాజాగా రిలీజైన థీమ్ సాంగ్‌కి విశేష స్పందన లభిస్తుంది. విన్న వారికి గూస్బంప్స్ వస్తున్నాయి. ఈ పాటని చైతన్య ప్రసాద్ రాశారు. గాడి తప్పుతోన్న విద్యా వ్యవస్థపై ఈ స్థాయిలో అక్షరాలను ఎక్కుపెట్టిన రచయిత మనకు కనిపించడు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది' అని అన్నారు. సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజరు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్బెనెల్, ఎడిటర్: జి. సత్య, ఆర్ట్: నరేష్‌బాబు తిమ్మిరి.