Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్టార్ డమ్‌ని నేను నమ్ముతాను. కాకపోతే ఇప్పుడు పిలుస్తున్న స్టార్ డమ్ కాదు. కంటెంట్ వల్ల వచ్చే స్టార్ డమ్‌ని నమ్ముతా' అని అంటున్నారు హీరో నాని. సైలెంట్‌గా హిట్స్ కొడుతూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు నాని. నాగార్జునతో కలిసి నటించిన మల్టీస్టారర్ 'దేవదాస్' తర్వాత ఆయన హీరోగా రూపొందిన చిత్రం 'జెర్సీ'. 'మళ్ళీరావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
తక్కువ టైమ్‌లో ఓకే చేశా..
గౌతమ్ తిన్ననూరి సినిమాకి సంబంధించిన ఫుల్ నెరేషన్ ఇచ్చారు. ఆయన నెరేట్ చేసిన విధానం బాగా నచ్చింది. కథలో లీనమైపోయా. దీంతో చాలా తక్కువ టైమ్‌లోనే సినిమాని ఓకే చేశా. 'ఏం చేద్దాం, ఎలా చేద్దామనేది ప్లాన్ చేద్దామ'ని చెప్పా. ఆ విషయం గౌతమ్‌కి అర్థం కాలేదు. దీంతో కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ తర్వాత మెసేజ్ ద్వారా క్లారిటీ ఇచ్చాను. గౌతమ్ చేసిన 'మళ్ళీరావా' సినిమా చూడలేదు. కానీ ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే అతనిపై నమ్మకం కలిగింది. అతని నిజాయితీ నచ్చింది. ఈ సినిమాని 'మజిలీ'తో పోల్చుతున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు.
బయోపిక్ కాదు..
ఇది క్రికెటర్ రమణ్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కిందనే వార్తల్లో నిజం లేదు. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ చూసి అలా అనుకుంటున్నారేమో?. ఆయన కూడా క్రికెట్ నుంచి బయటికివెళ్ళి మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యారేమో? నాకు తెలియదు. 'జెర్సీ' అనే టైటిల్ ఎందుకు పెట్టామనేదానికి స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో అర్జున్ క్రికెటరా? ఫ్రస్టేటెడ్ క్రికెటరా? అంటే కొన్ని సార్లు రెండు కావచ్చు, కాకపోవచ్చు. అతన్ని లూసర్ అని, తక్కువ చేసి మాట్లాడటం వంటివి ఉంటాయి. వాటి వల్ల ఫ్రస్టేషన్ ఉంటుంది. దాన్ని వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది ఆసక్తికరం.
అది అనుకోకుండా జరిగింది..
ఇందులో నా పేరు అర్జున్, మా అబ్బాయి పేరు నాని. రియల్ లైఫ్‌కి రివర్స్. అదంతా అనుకోకుండా జరిగింది. దర్శకుడు కథ రాసుకున్నప్పుడే ఆ పేర్లు అనుకున్నట్టు చెప్పాడు. సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మా అబ్బాయిగా రోనిత్ నటించాడు. తను చాలా ఎనర్జిటిక్. ఎప్పుడూ మాట్లాడుతుండేవాడు. తన వల్ల మాకు ఎనర్జీ వచ్చేది. బేసిక్‌గా నాకు పిల్లలంటే ఇష్టం. వారితో సరదాగా ఆడుకుంటుంటాను. నేను పిల్లలతో కలిసి చేసినన్నీ సినిమాలు మరెవ్వరూ చేసి ఉండరు. సత్యరాజ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభవం. శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన నటి. మేం ఊహించిన దానికంటే మెరుగైన నటనని ఇచ్చింది.
అప్పుడు చాలా దెబ్బలు తగిలాయి..
చిన్నప్పుడు గల్లీలో క్రికెట్ ఆడేవాడిని. స్కూల్లో లాస్ట్ బ్యాట్స్‌మెన్ నేనే. టీమ్‌లో అందరు ఔట్ అయిపోతే, ఎవరికైనా దెబ్బలు తగిలితే నన్ను తీసుకునేవారు. ఈ సినిమా కోసం డానియల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నా. చాలా దెబ్బలు కూడా తగిలాయి. నిజం చెప్పాలంటే 'భీమిలి కబట్టి జట్టు' టైమ్‌లో ఇంకా చాలా దెబ్బలు తగిలాయి. కాళ్లు కొట్టుకుపోయాయి. అప్పుడు ఇంత మీడియా లేదు. కాబట్టి బయటకు రాలేదు. ఈ సినిమా చేశాక క్రికెట్‌పై పూర్తిగా నాలెడ్జ్ వచ్చింది. ఒకప్పుడు క్రికెట్ వస్తుందంటే రిమోట్ నొక్కేవాడిని. ఇప్పుడు చూస్తున్నా. క్రికెట్ అంటే బ్యాట్‌తో బాల్ని కొట్టడం కాదు, ఫోర్లు, సిక్స్‌లను మించి ఇంకేదో ఉందని అర్థమైంది. 'భీమిలి కబడ్డి జట్టు' తర్వాత స్పోర్ట్స్ కొన్ని కథలు వచ్చినా నచ్చలేదు. అన్నీ నచ్చాలని లేదు కదా!.
మొదటిసారి సంతృప్తిగా ఉన్నా..
సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మొదటిసారి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఓ గొప్ప సినిమా చేస్తున్న ఫీలింగ్ కలిగింది. హైగా అనిపించింది. అన్ని విధాలుగా సంతృప్తినిచ్చింది. ఇన్నేండ్ల కెరీర్లో నటుడిగా నేను ఒక్కో సినిమాకి ఎదుగుతూ వస్తున్నా. అదంతా అర్జున్ పాత్ర కోసం ఉపయోగపడింది. పాత్ర నాలోని నటనని మొత్తం పిండేసింది. కెరీర్ పరంగా నెక్ట్స్ లెవల్ చిత్రమవుతుందని నమ్ముతున్నా. ఇందులో ఫాదర్‌గా నటించాను. రియల్ లైఫ్‌లోనూ ఫాదర్నే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. మంచి కాస్ట్యూమ్, ప్రోస్తటిక్స్ కుదిరితే తాతగానైనా నటించేందుకు సిద్ధమే.
మా అబ్బాయికి ఆ వయసు రాలేదు..
సినిమాలో ప్రతి తండ్రీ ప్రపంచం దృష్టిలో ఏమైనా ఫర్వాలేదు. కానీ కొడుకు దృష్టిలో మాత్రం హీరో కావాలనుకుంటాడు. రియల్ లైఫ్‌లోనూ అది నిజం. అందుకే సినిమాలో ఆ డైలాగ్ అంతగా పాపులర్ అయ్యింది. రియల్ లైఫ్‌లో మా అబ్బాయికి ఇంకా నన్ను జడ్జ్ చేసే వయసు రాలేదు. వచ్చినా జడ్జ్ చేయడు. కెరీర్ పరంగా నన్ను ఎవరూ జడ్జ్ చేయలేదు. ఇప్పటి వరకు నటన పరంగా కామెంట్ చేయలేదు. కానీ రెండుమూడు కమర్షియల్ సినిమాలు చేస్తే 'నాని ఇక కమర్షియలేనా' అన్నారు.
ఓవర్సీస్తో థ్రిల్ మిస్సవుతున్నాం..
మన చిత్ర పరిశ్రమలో గత రెండేండ్లుగా చాలా మార్పు వచ్చింది. కథల్లోనూ మార్పులు వస్తున్నాయి. హీరోలు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది. ఒకప్పుడు ఏ సినిమా అయినా ఫస్ట్ షోకి చూడాలని థ్రిల్ ఫీలయ్యేవాళ్ళం. కానీ ఓవర్సీస్లో ముందే ప్రదర్శించబడటం, సోషల్ మీడియా వల్ల ఆ రిజల్ట్ ముందే తెలియడంతో ఆ క్యూరియాసిటీ, థ్రిల్ మిస్సవుతున్నాం. అలా కాకుండా ఉండాలంటే ఆ రోజు సెల్ ఫోన్ పక్కన పెట్టి థియేటర్‌కి వెళ్ళి సినిమాని ఎంజారు చేయాలి. ప్రస్తుతం విక్రమ్ కుమార్‌తో 'గ్యాంగ్ లీడర్' చేస్తున్నా. ఆ టైటిల్ వివాదమేంటో తెలియదు. ఆ సినిమాకి, దీనికి సంబంధం లేదు. సినిమా చూశాక ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా త్వరలో తెలుస్తుంది.
ముద్దుగా పిలుచుకుంటున్నారు..
నేను స్టార్ డమ్‌ని నమ్ముతా. కాకపోతే అది కంటెంట్ పరంగా వచ్చే స్టార్ డమ్ అయి ఉండాలి. సినిమా సినిమాకి ఎదగడంలో నాకు ఒత్తిడి లేదు. అప్పట్లో చిన్న కామెంట్ చేసినా బాగా ఆలోచించే వాడిని. ఇప్పుడు ఆ సైకిల్ అర్థమైంది. నచ్చిన కథ చేసుకుంటూ వెళ్తున్నా. అందుకే ఫెయిల్యూర్ అనే ఒత్తిడి, భయం అస్సలు లేదు. అదే సమయంలో అందరూ నన్ను 'నేచురల్ స్టార్' అంటున్నారు. అదంతా వారు నాపై చూపిస్తున్న ప్రేమ. చిన్నప్పుడు మా అమ్మ నాకు నవీన్ అని పేరు పెట్టింది. ముద్దుగా నాని అని పిలిచేది. ఇప్పుడు అందరూ అలాగే ముద్దుగా 'నేచురల్ స్టార్' అంటున్నారు. ఈ విషయంలో నేను హ్యాపీగానే ఉన్నా. 'అష్టాచెమ్మా' టైమ్‌లో ఇంద్రగంటిగారు నాలో స్టార్ మెటీరియల్ ఉందన్నారు. కానీ నాకర్థం కాలేదు. నన్నెవరు చూస్తారులే అనుకున్నా. ఆ రిజల్ట్‌తో నేనేంటో తెలిసింది.