Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. 'ఖైదీ నంబర్ 150' వంటి బ్లాక్ బస్టర్‌తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాక ఆయన నటిస్తున్న చిత్రమిది. పైగా మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో దీన్ని చిరంజీవే కాదు, టీమ్ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక నిర్మాత రామ్‌చరణ్ దీన్నొక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా, తండ్రికి ఇచ్చే గిఫ్ట్‌గానూ భావిస్తున్నారు. అందుకే రాజీపడకుండా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఫైనల్ షెడ్యూల్‌ని జరుపుకుంటోంది. దట్టమైన అడవిలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌కి స్కోప్ ఉంది. వాటికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. సినిమాని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నట్టు గతంలో నిర్మాత రామ్‌చరణ్ ప్రకటించారు. కాని అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో విడుదల తేదీని మార్చాలనుకుంటున్నారట. సంక్రాంతి బరిలో 'సైరా'ని దించాలని యూనిట్ భావిస్తోంది. సంక్రాంతి టార్గెట్‌గా సినిమాని రాజీపడకుండా పూర్తి చేయాలనుకుంటున్నారు. మహేష్ నెక్ట్స్ సినిమా, రజనీకాంత్ 'దర్బార్' సైతం వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేశాయి. 'సైరా' ఇప్పుడు వాయిదా పడితే వచ్చే సంక్రాంతి పోటీ మామూలుగా ఉందని వేరే చెప్పక్కర్లేదు. 'సైరా' తర్వాత కొరటాల శివ, త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమాలు చేయనున్నారు. మరోవైపు శంకర్‌తోనూ ఓ సినిమా ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం విదితమే.