Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పి.సునీల్ కుమార్‌రెడ్డి రూపొందుతున్న చిత్రం 'రొమాంటిక్ క్రిమినల్స్'. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'ఒక క్రిమినల్ ప్రేమకథ' చిత్రాలకి సీక్వెల్‌గా శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ పతాకాలపై ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. నటీనటులు తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ముందు రెండు చిత్రాల్ని మించి వినోదంతో పాటు చక్కటి సందేశం ఉంటుంది. ఈ చిత్రానికి ఎస్.వి. శివరామ్ సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అవుతుంది, విశాఖ, అరకులోని అందాలే కాకుండా గంజారు తోటల్లో పోలీసుల దాడి చేసే సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించాం. సుధాకర్ మారియో సంగీతం సారథ్యంలో నాలుగు పాటలు చాలా చక్కగా కుదిరాయి' అని అన్నారు. నిర్మాతల్లో ఓకరైన బి.బాపిరాజు చెబుతూ, 'ఈ సినిమా పూర్తిగా విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంది. ముసుగుల వెనుక ఉన్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆశక్తికరంగా తీర్చిదిద్దాం. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా, ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ నేపథ్యంలో వ్యసనాల పర్యవససానాలు వినాశకారకంగా ఉంటాయనే పాయింట్‌ని వినోదం పాళ్ళు తగ్గించకుండా దర్శకుడు తెరకెక్కించారు. మేలో సినిమాని విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.