Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనకు తెలియకుండా మన పక్కనే చాలా మంది హీరోలుంటారు. వారిలో అపారమైన ప్రతిభ ఉంటుంది. అలా గుర్తింపు రాని, మెయిన్ స్ట్రీమ్‌లోకి రాని, మన చుట్టూ ఉన్న హీరోల కథ చెప్పాలనుకుని 'జెర్సీ' స్క్రిప్ట్ రాసుకున్నా. సినిమా విజయం సాధిస్తుందని ఊహించలేదు' అని అంటున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి రూపొందించిన 'జెర్సీ' చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
ఆయన చెప్పిన మాటలే స్ఫూర్తి
ఓసారి హైదరాబాద్‌లో హర్ష బోగ్లే సెమినార్‌కి అటెండ్ అయ్యాను. ఆయన సచిన్ గొప్పతనం గురించి చెప్పారు. సచిన్‌లా చాలా మంది ప్రతిభావంతులు మన దగ్గర ఉన్నప్పటికీ, ఆయన తన మంచి ఆటిట్యూడ్ వల్ల గొప్పవాడుగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. ఆయన చెప్పినదాంట్లో సచిన్ గొప్పతనం కన్నా మిగిలిన చాలా మంది ప్రతిభావంతులున్నారనే పాయింట్ నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాసుకున్నా. ఇది రమణ్ లాంబా కథో, మరొకరి కథో కాదు. 'మజిలీ'కి దీనికి సంబంధం లేదు. ముందే ఆ దర్శకుడు శివతో కూర్చుని చర్చించాం. పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ ఇది. మన చుట్టూ మనకు తెలియకుండా చాలా మంది ప్రతిభావంతులుంటారు. వారి కథ చెప్పాలనుకున్నా.
కొన్ని సార్లు నాకే భయం వేసింది
స్పోర్ట్స్ ప్రధానంగా రాసిన ఈ కథ నాకిష్టమైనది. 'మళ్ళీరావా' సక్సెస్ తర్వాత ఈ కథే తీయాలనుకున్నా. నిజానికిది మూడేండ్ల క్రితమే రాసుకున్నా. క్రికెట్ మనకు బాగా తెలుసు. ఈజీగా కనెక్ట్ అవుతుందని ఎంచుకున్నా. పెద్దగా రీసెర్చ్ కూడా చేయలేదు. కానీ కథపై చాలా రోజులు వర్క్ చేశాను. ఈ కథ చెప్పినప్పుడు నాని వెంటనే ఓకే చెప్పారు. నాకంటే ఆయనే ఎక్కువగా నమ్మారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెంట్‌ని చూసి కొన్ని సార్లు నాకే భయమేసింది. సినిమా హిట్ అవుతుందనుకోలేదు. నిర్మాతలు ఎంతో డబ్బు పెట్టి తీస్తారు, హిట్ అవుతుందో లేదో అనే టెన్షన్ ఉండింది. ఇప్పటికీ అందులోనే ఉన్నా. సక్సెస్‌ని ఎంజారు చేయడానికి టైమ్ పడుతుందనుకుంటున్నా. సినిమా చూసి ఎన్టీఆర్, బన్నీ ట్వీట్ పెట్టి ప్రశంసించడం చాలా హ్యాపీగా ఉంది.
అది ఇప్పుడే చెప్పలేను
కొడుకు దృష్టిలో హీరో అవ్వాలనుకునే హీరో, ఫ్యామిలీని అనాథ చేశారనే ప్రశ్నలు రావచ్చు. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయలేను. కాకపోతే అర్జున్ క్రికెట్ తప్ప మరేం చేయలేడు. అందరూ అతన్ని చులక చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తానేంటో మళ్ళీ నిరూపించుకునేందుకు చనిపోతాడని తెలిసినా ముందుకు సాగాడనేది చెప్పాం. రంజీ మ్యాచ్‌కి ఎంపికైనప్పుడు రైల్వే స్టేషన్లో అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేసే తీరు ప్రత్యేకంగా ప్లాన్ చేశాం. అది సినిమాలో హైలైట్ అయ్యింది. దానికి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో ఒకే టైమ్‌లో రెండు, మూడు కాలాలని చెప్పడం అనుకోకుండా జరిగింది. సినిమాలో వినోదం మిస్ అయ్యిందంటున్నారు. బహుశా కామెడీ నా స్ట్రెన్త్ కాదేమో.
భిన్నమైన సినిమాలతోనే ప్రయాణం
నా దగ్గర చాలా కథలున్నాయి. తదుపరి సినిమా ఏంటనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కొంత గ్యాప్ తీసుకుంటా. ఈ సినిమాని రీమేక్ చేయాలని అంటున్నారు. నాకైతే ఆ ఆలోచన లేదు. 'అర్జున్‌రెడ్డి'ని సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో చేస్తున్నారు. ఆయన చాలా టాలెంటెడ్. నాకు అంత లేదు. ఇప్పటిలాగే డిఫరెంట్, యూనిక్ స్టోరీలను చెప్పాలనుకుంటున్నా. నేను కథను బట్టే హీరోని ఎంపిక చేసుకుంటా. కథ రాసుకున్నాకే అది ఏ హీరోకి సూట్ అవుతుందో వారికి చెబుతాను. ఇక రియల్ లైఫ్‌లో రెగ్యులర్ సినిమా కష్టాలే పడ్డాను. కానీ 'జెర్సీ'లో అర్జున్ అంత కష్టాలు పడలేదు (నవ్వుతూ).