Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'షోలే'.... కథలో హీరోయిజాన్ని చూపి భారతీయ సినిమా గమనాన్నే మార్చేసిన సినిమా.. సంచలన వసూళ్ళ రికార్డులతో బాలీవుడ్ ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా.. బ్లాక్‌బస్టర్ అనే పదానికి నికార్సైన సినిమాగా నిలిచిన చిత్రం.. తలపండిన దర్శకులకే కాదు నూతన దర్శకులకు సైతం ఇదొక రిఫరెన్స్ సినిమా.. పక్కా కమర్షియల్ చిత్రానికి కేరాఫ్ అడ్రస్.. ఈ సినిమాకి ముందు.. ఈ సినిమాకి తర్వాత అనేంత గొప్ప విజయాన్ని సాధించిన సినిమా.. సిల్వర్‌స్క్రీన్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలై నేటికి నలభై ఏళ్ళు పూర్తయ్యింది. నాలుగు దశాబ్ధాలుగా అశేష సినీ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రానికి నేపథ్యం.. ఓ కరడుగట్టిన బంది పోటు చెరలో ఉన్న ఓ ఊరు. ఆ బందిపోటు నుంచి ఊరిని కాపాడ్డం కోసం ఇద్దరు ఖైదీలతో ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటమే కథ. హీరోలకి ధీటుగా ప్రతినాయకుడి పాత్రని మలిచిన తీరు అద్భుతం. 1975 ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం తొలివారం ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. తర్వాత తర్వాత ప్రేక్షకులు సినిమాని చూడ్డం మానేసి ప్రేమించడం స్టార్ట్ చేశారు. ఇందులోని ప్రతి సన్నివేశానికి, ప్రతి డైలాగ్‌కి ముఖ్యంగా 'గబ్బర్‌సింగ్'గా అంజాద్‌ఖాన్ చెప్పిన డైలాగ్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఓ సునామీలా వసూళ్ళ వర్షం సంచలనం సృష్టించింది. తొలుత 198 నిమిషాల నిడివితో విడుదలైన ఈ చిత్రాన్ని 1991లో డైరెక్టర్స్ కట్ పేరుతో 204 నిమిషాల నిడివితో మళ్ళీ విడుదల చేశారు. తాజాగా 2014 జనవరిలో త్రీడీ ఫార్మెట్లో విడుదల చేశారు. ఏ ఫార్మెట్లో విడుదల చేసినా సంచలన విజయమే సాధించింది. 'జై'గా అమితాబ్‌బచ్చన్, 'వీరు'గా ధర్మేంద్ర, 'బసంతీ'గా హేమామాలిని, 'రాధ'గా జయ భాదురి, 'ఠాకూర్ బల్దేవ్సింగ్'గా సంజీవ్‌కుమార్, 'గబ్బర్‌సింగ్'గా అంజాద్‌ఖాన్ తమదైన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. బెంగుళూరు, కర్నాటక ప్రాంతాలకు చెందిన రామ్‌నగర కొండల ప్రాంతంలో చిత్రీకరించిన ఈచిత్రంలోని పాటలకు సైతం ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్ అందించిన అత్యద్భుతమైన సంగీతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌గా 'షోలే' పాటలు నిలిచాయనటం లో అతిశయోక్తి లేదు. సలీమ్, జావేద్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అత్యద్భుతం. 1999లో బిబిసి ఇండియా 'ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియం'గా 'షోలే'ని ప్రకటిం చింది. తనయుడు రమేష్ సిప్పి దర్శకత్వంలో తండ్రి జి.పి.సిప్పి భారీ బడ్జెట్‌తో 'షోలే'ని నిర్మించడం విశేషం.