Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మ్యూజిక్ విషయంలో నేను ఎప్పుడూ కొత్తగా అందించేందుకు ప్రయత్నిస్తా. ఈ క్రమంలో ప్రశంసలతోపాటు విమర్శలని కూడా పాజిటివ్‌గానే స్వీకరిస్తా' అని అంటున్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో ఏ కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం 'సీత'. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనూప్ రూబెన్ బుధవారం మీడియాతో ముచ్చటిం చారు. ఆయన మాట్లాడుతూ, 'ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు, విలన్ పాత్రలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. బెల్లకొండ సాయి శ్రీనివాస్ చాలా కొత్తరకమైన పాత్రలో కనిపిస్తారు. కాజల్ పాత్ర బలంగా ఉంటుంది. ఓ రకంగా దర్శకుడు తేజ చేస్తున్న ఓ ప్రయోగమని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాకి నేను సంగీతం అందించడం ఆనందంగా ఉంది. తేజ దర్శకత్వంలోనే నేను సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఆయన రూపొందించిన 'జై' సినిమాతో నా ఎంట్రీ జరిగింది. ఆయనతో నాకిది నాల్గో సినిమా. తేజతో పనిచేయడం చాలా కష్టమని తరచూ కామెంట్ వినిపిస్తుంటుంది. నాకు మాత్రం అలా ఎప్పుడూ అనిపించలేదు. అయన చాలా క్లారిటీతో ఉంటారు. తనకు ఎలాంటి మ్యూజిక్ కావాలో తెలుసు. దాన్ని క్లీయర్‌గా వివరిస్తారు. అలాంటి మ్యూజిక్‌నే కోరుకుంటారు. ఆయనకు నచ్చింది ఇస్తే అందులో ఇబ్బందే లేదు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి శ్రోతకాదరణ పొందాయి. 'నిజమేనా..' పాటకి మంచి స్పందన లభిస్తుంది. సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, రీ రికార్డింగ్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆర్ ఆర్ విషయంలో కొత్తగా ప్రయోగం చేశాను. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. తప్పకుండా ఈ సినిమాతో మళ్ళీ నాకు మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇక సినిమాకి 'సీత' అని టైటిల్ పెట్టడంతో ఇది లేడి ఓరియెంటెడ్ సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది రెగ్యులర్ కథే. సీత అనేది కేవలం హీరోయిన్ పేరు మాత్రమే. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది. నాకు సినిమాల విషయంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. నేను కావాలని తీసుకున్న గ్యాప్ కాదు. కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, కొన్ని మిస్ అవుతున్నాయి. అలా గతేడాది నా నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. నేను మ్యూజిక్ విషయంలో కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తా. దాంతో పాటు ప్రశంశలు అందుకున్నప్పుడు విమర్శలు కూడా తీసుకోవాలనుకుంటాను. అప్పుడే మనలోని క్వాలిటీస్‌ని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాకి సంగీతం అందిస్తున్నా. దీంతోపాటు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నా. అందులో ఒకటి కార్తికేయ హీరోగా రూపొందుతుంది. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి' అని అన్నారు.