Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కెరీర్ పరంగా గ్యాప్ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. కానీ ఇప్పటి వరకు చేసిన సినిమాల పరంగా, వాటి సంఖ్య పరంగా హ్యాపీగానే ఉన్నా' అని అంటున్నారు అల్లు శిరీష్. ఆయన హీరోగా రుక్సర్ థిల్లాన్ కథానాయికగా సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఏబీసీడీ'. 'అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ' అనేది ట్యాగ్‌లైన్. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడుతూ, 'అమెరికాలో మంచి సంపన్న కుటుంబానికి చెందిన కుర్రాడికి డబ్బు విలువ తెలియడం కోసం వాళ్ళ నాన్న ఇండియాకు పంపిస్తే ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. తాను ఏం తెలుసుకున్నాడనేది సినిమా. ఇది నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. సినిమా చేస్తుంటే ముంబయిలో కాలేజ్ రోజులు, యూఎస్‌లో ఫిల్మ్ స్కూల్ రోజులు గుర్తుకొచ్చాయి. అలాగే మా నాన్న గుర్తుకొచ్చారు. అయితే మలయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ 'ఏబీసీడీ' చిత్రాన్ని రామ్‌చరణ్‌తోపాటు పలువురు స్నేహితులు నాకు సజెస్ట్ చేశారు. అదే టైమ్‌లో సంజీవ్‌రెడ్డి 'సంతానం ప్రాప్తిరస్తు' కథతో నా వద్దకు వచ్చారు. అప్పుడు ఈ మలయాళ సినిమా గురించి చెప్పా. తను కూడా రీమేక్ చేసేందుకు ఆసక్తిని వెల్లడించారు. అలా ఈ సినిమా కుదిరింది. పవన్ సాధినేని, కృష్ణ చైతన్య, సుధీర్ వర్మ, బీవీఎస్ రవి నాకు మంచి స్నేహితులు. వీరంతా స్క్రిప్ట్‌లో తన ఇన్పుట్స్ అందించారు. ఇందులో సోల్ మాత్రమే మేం తీసుకున్నాం. ఓ పది సన్నివేశాలు యధాతథంగా చిత్రీకరించాం. మిగిలినవన్నీ మార్చాం. సినిమాలో డ్రామా బ్యాలెన్డ్స్‌గా ఉంటుంది. ఫస్ట్ కాపీ చూశాక ఔట్పుట్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇందులో కొంచెం పొలిటికల్ టచ్ ఉంటుంది. ఆ రాజకీయ పరిస్థితుల కారణంగా హీరోలో మార్పు వస్తుంది. అది అంత వరకే పరిమితం. ఓ సందర్భంలో డీసెంట్ యాక్టర్‌కి, గుడ్ యాక్టర్‌కి తేడాని సుకుమార్ చెప్పారు. దర్శకుడు చెప్పింది చేసేవాడు డీసెంట్ యాక్టర్ అని, దర్శకుడు చెప్పింది చేస్తూ, తను సొంతంగా సీన్‌ని మరో స్థాయికి తీసుకెళ్ళేవాడు గుడ్ యాక్టర్ అన్నారు. అలా నేను కూడా గుడ్ యాక్టర్‌ని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో కొన్ని కామెడీ ట్రాక్స్ భరత్‌తో కలిసి బెటర్మెంట్ చేశాం. ఇక 'ఒక్క క్షణం' ఫెయిల్యూర్ టైమ్‌లో చాలా బాధపడ్డా. కానీ చూసిన వాళ్ళెవరూ బాగా లేదని చెప్పలేదు. కాకపోతే అందరికి రీచ్ కాలేదు. కెరీర్ పరంగా వచ్చే గ్యాప్‌కి కారణమేంటనేది తెలియదు. నేను మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉన్నా. కెరీర్ పరంగా హ్యాపీగానే ఉన్నా. ఇన్నేండ్ల నటన నాకు చాలా నేర్పింది. కెమెరాముందు నిల్చునే భయం పోయింది. ప్రస్తుతం రెండు కథలకు చర్చలు జరుగుతున్నాయి. అందులో ఒకటి నాకిష్టమైన లవ్ స్టోరీ. ఆ వివరాలు వచ్చే నెలలో వెల్లడిస్తాం' అని అన్నారు.