Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్ మొదటి సారి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'దర్భార్' చిత్రంలో నటిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబయిలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన ఓ సన్నివేశాన్ని కూడా షూట్ చేశారట. ఈ నెలాఖరుతో తొలి షెడ్యూల్ పూర్తవుతుందని సమాచారం. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ రెండో షెడ్యూల్‌ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే, ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం పోషిస్తుండటం విశేషం. ఓ పాత్ర పోలీస్ అధికారిగా ఉంటుందట. అందులో పవర్‌పుల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీ విశ్వరూపంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ 'మూండ్రు ముగం', 'పాండియన్', 'కోడి పరాకథు' వంటి చిత్రాల్లో పోలీస్ అధికారిగా ఆకట్టుకున్న విషయం విదితమే. మరో పాత్ర సమాజ సేవకుడిగా ఉంటుందట. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రజనీ లుక్ విడుదలైంది. ఇందులో స్టయిలీష్ పోలీస్ అధికారిగా రజనీ లుక్ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మరో రజనీకాంత్ బ్యాక్ తిరిగి సాధారణ డ్రెస్‌లో ఉన్నారు. ఈ సినిమాలో నివేధా థామస్ రజనీ కూతురిగా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ అంశాలకి సామాజిక సందేశాన్ని జోడించి సినిమాల్ని రూపొందించడంలో దర్శకుడు మురుగదాస్ ఎక్స్పర్ట్. ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా ఉంటుందట. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రజనీ ఫ్యాన్స్‌తోపాటు సాధారణ ప్రేక్షకులకి సైతం నచ్చుతుందనే నమ్మకంతో చిత్రయూనిట్ ఉంది.