Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ సంజరు, హీనా అచ్రా, అపూర్వ శర్మ హీరోహీరోయిన్లుగా మల్యాద్రి మామిడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'స్టార్'. సహస్త్ర మూవీ మేకర్స్ పతాకంపై శ్రీహరి పట్టపు నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్‌ని శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో నవీన్ మాట్లాడుతూ, 'ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో నేను స్ట్రీట్ ఫైటర్‌గా కనిపిస్తా. నా బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా 30 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. రెండు ఫైట్స్ చిత్రీకరించాం. ఫైట్ మాస్టర్స్ నబా, సుబ్బు బాగా కంపోజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చాయి. త్వరలో మెయిన్ షెడ్యూల్లోకి వెళ్ళనున్నాం. నాకిది హీరోగా బ్రేక్‌నిచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు.
'రెండేండ్లుగా ఈ కథతో నిర్మాత శ్రీహరితో ట్రావెల్ అవుతున్నాం. నిర్మాతగా ఆయన అందిస్తున్న సపోర్ట్ మరువ లేనిది. యాక్షన్ ప్రధానంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. కెమెరామెన్ ఆర్ఎం స్వామి అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ఉంటుంది. ఆమెను ఉద్దేశించి ఈ సినిమాకి 'స్టార్' అనే టైటిల్ పెట్టాం. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది' అని చిత్ర దర్శకుడు మల్యాద్రి చెప్పారు. ఫైట్ మాస్టర్ సుబ్బు చెబుతూ, 'గతంలో నేను 'శరణం గచ్చామి', 'గూఢచారి', 'మా అబ్బాయి' వంటి చిత్రాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశా. 'గూఢచారి'లో ఫైట్స్ చూసి ఈ సినిమాకి అవకాశం కల్పించారు. దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని చెప్పారు. 'తెలుగులో నేను నటించడం కొత్త. లాంగ్వేజ్ కష్టమవుతుంది. ఈ చిత్ర కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది' అని హీనా తెలిపారు. 'నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు. పాత్రని జస్టిఫై చేయటం కోసం నా వంతు హార్డ్ వర్క్ చేస్తా' అని మరో నటి అపూర్వ తెలిపారు. నిర్మాత శ్రీహరి చెబుతూ, 'దర్శకుడు రెండుమూడేండ్లుగా మాతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన చెప్పిన మూడు, నాలుగు కథల్లో ఇది బాగా నచ్చింది. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాం' అని చెప్పారు.