Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మాదిరి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా' అని మధుర శ్రీధర్ అన్నారు. దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుర శ్రీధర్ తాజాగా 'ఏబీసీడీ' చిత్రాన్ని నిర్మించారు. దీనికి సురేష్‌బాబు సమర్పకులు. అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్ జంటగా మాస్టర్ భరత్ కీలక పాత్రలో సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ని తెచ్చుకుంటున్న నేపథ్యంలో మంగళవారం మధుర శ్రీధర్ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ, 'రీమేక్ (మలయాళ 'ఏబీసీడీ'కిది రీమేక్) చేయడం నాకిది తొలిసారి. దీంతో చాలా కష్టంగా అనిపించింది. అందుకే పవన్ సాధినేని, సుధీర్ వర్మ, బీవీఎస్.రవి, కృష్ణచైతన్య వంటి దర్శకుల సలహాలు తీసుకున్నాం. అమెరికాలో పుట్టిన ఓ యువకుడు ఇండియా ఎందుకు వచ్చాడు? ఇక్కడ తనకెదురైన సంఘటనలు ఏంటి?, తనలో వచ్చిన మార్పేంటి ? అనే కథాంశంతో మీడియా, రాజకీయ అంశాల సమాహారంగా ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా తెరకెక్కించాం. అల్లు శిరీష్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎలాంటి పాత్రల్లోనైనా ఇట్టే ఒదిగిపోయే తత్వం శిరీష్‌ది. ఇందులో అరవింద్ ప్రసాద్ పాత్రలో నటించి మెప్పించడంతోపాటు పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయనకు భరత్, వెన్నెల కిషోర్ తోడు కావడంతో సినిమాలో వినోదం బాగా పండింది. విడుదలైన సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. చూసిన వారంతా చాలా రోజుల తర్వాత చక్కటి వినోద భరిత సినిమా చూశామంటున్నారు. అయితే ఈ సినిమాని ఇతర చిత్రాలతో పోల్చడమనేది కామన్. పెద్ద హిట్ అయిన సినిమాకి కూడా విమర్శలు సర్వసాధారణమే. ఈ సినిమాని 'పిల్లా జమిందార్'తో పోలుస్తున్నారు. కథల పరంగా పూర్తి భిన్నమైనవి. విమర్శల నుంచి మంచి అంశాలను స్వీకరించి నెక్ట్స్ సినిమాకి అవి రిపీట్ కాకుండా చూసుకోవాలనేది నా అభిప్రాయం. అయితే ప్రపంచంలో ఉండేవి పది కథలే. ఏ సినిమా తీసినా వాటి చుట్టే తిరుగుతుంటాయి. కాబట్టి ఒక దానిని పోలి చాలా ఉంటాయి. ప్రస్తుతం 'దొరసాని' చిత్రాన్ని నిర్మిస్తున్నా. 1980నాటి ప్రేమ కథతో, విజరు దేవరకొండ తమ్ముడు ఆనంద్, రాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. జులై 5న విడుదల చేయనున్నాం. దర్శక, నిర్మాతగా నాకు కరణ్ జోహార్ స్ఫూర్తి. ఆయనలా రాణించాలనుకుంటున్నా. ఆయన ఐదారేండ్లకు ఓ సినిమా చేస్తూ మధ్యలో నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. అలాగే నేను నిర్మించే సినిమాలో దర్శకత్వం వైపు ఇన్వాల్వ్ అవుతుంటా. ఎప్పుడు ఏ సన్నివేశం తీస్తున్నారనేది ప్రతి క్షణం గమనిస్తుంటా' అని అన్నారు.