Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం వల్ల ఎవరూ చూసినా ఒకేలా నటిస్తున్నాడు, ఒకేలా హావభావాలు పలికిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇకపై రియాలిటీకి దగ్గరగా, విభిన్న కథా నేపథ్యంతో కూడిన మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలను కుంటున్నా' అని అంటున్నారు బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సీత'. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
కలుషితమైన సమాజానికి దూరంగా..
ఇందులో నేను చిన్నప్పట్నుంచి రెగ్యులర్ సమాజానికి దూరంగా చదువుకుంటుంటాను. జనాలకు దూరంగా పొల్యూట్ కాకుండా పెరుగుతాను. అలాంటి నాకు జనారణ్యంలోకి వచ్చాక అంతా కొత్తగా అనిపిస్తుంది. కూల్‌గా ఉంటాను. ఏం చేసినా దాన్ని ఆస్వాదించాలనుకుంటాను. కానీ సీత తాను అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోదు. డబ్బుంటే అన్నీ ఉంటాయను కునే మనస్థత్వం ఆమెది. అలాంటి పరిస్థితిలో నా వల్ల సీతలో, సీత వల్ల నాలో వచ్చిన మార్పేంటి అన్నది సినిమా. చాలా కొత్తగా ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది. చివరి అరగంట చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అది అందరికి కనెక్ట్ అవుతుంది. సినిమా చూసి మా అమ్మ, తమ్ముడు ఏడ్చారు. అప్పుడే హిట్ గ్యారంటీ అనుకున్నా.
సవాల్‌తో కూడిన పాత్ర..
ఇందులో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. విభిన్న భావోద్వేగాలు ఏకకాలంలో పలికించాలి. ఇలాంటి పాత్రలో నటించడం నాకు కొత్త. చాలా ఛాలెజింగ్‌గా అనిపించింది. పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. మరోవైపు చాలా రోజుల తర్వాత ఇందులో కామెడీ చేశాను. 'అల్లుడు శీను' తర్వాత కామెడీ చేసే అవకాశం వచ్చింది. 'నువ్వు మా వద్ద బాగానే కామెడీ చేస్తావు. సినిమాల్లో ఎందుకు చేయవని' నా ఫ్రెండ్స్ తరచూ అంటుండేవారు. గత సినిమాల్లో చేయాల్సి రాలేదు. ఇందులో ఆ స్కోప్ ఉంది. తేజ సార్ బాగా చేయించారు. ఫైనల్‌గా సినిమా అద్భుతంగా వచ్చింది. నాన్న(బెల్లంకొండ సురేష్) సినిమాని ఇంకా చూడలేదు. ఆయనకు ఈ సినిమాతో మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా.
ఎవరూ ఒప్పుకోరట..
'కవచం' తర్వాత మరోసారి కాజల్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కథ చెప్పినప్పుడు హీరోయిన్ కాజల్ ఫైనల్ అయ్యిందన్నారు. మాకిది రెండోసారి కావడంతో మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమాకి 'సీత' టైటిలే కరెక్ట్. లేడీ ఓరియెంటెడ్ టైటిల్స్ పెట్టాలంటే చాలా మంది హీరోలు ఒప్పుకోరు. నేను ఒప్పుకోవడంతో చాలా మంది ఫోన్ చేసి ప్రశంసించారు. సోనూసూద్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా ప్రొడక్షన్లో 'కందిరీగ' చిత్రానికి వర్క్ చేశారు. ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయ్యారు. సినిమాని కాంబోడియాలోని ఓ కొత్త లొకేషన్లలో చిత్రీకరించాం. అవి సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి.
ఆయన స్వీట్ పర్సన్..
తేజ సార్ మొదట రెండు కథలు చెప్పారు. నా కిది బాగా నచ్చింది. నాన్నకు కమర్షియల్‌గా ఉండే కథ నచ్చింది. బహుశా నేను ఇలాంటి పాత్రలు చేస్తాననే నమ్మకం నాన్నకు లేదేమో(నవ్వుతూ). షూటింగ్ ఫస్ట్ రోజు తేజ సార్ ఓ పెద్ద డైలాగ్ పేపర్ ఇచ్చి అది చెప్పమన్నారు. నేను షాక్ అయ్యా. కానీ ఓ పది నిమిషాలు బాగా ప్రిపేర్ అయి చెప్పా. దీంతో 'నీలో ఇంత ఉందనుకోలేదు. నిన్ను మరోలా ఊహించుకున్నా' అని అన్నారు. తేజ సార్‌పై చాలా కామెంట్స్ వస్తుంటాయి, కానీ ఆయన చాలా స్వీట్, జెన్యూన్ పర్సన్. నచ్చితే మంచి ఇన్పుట్స్ ఇస్తారు. తేజ సార్ రూపొందించిన 'జయం'కి, దీనికి ఎలాంటి సంబంధం లేదు. బేసిక్‌గా ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్త పాయింట్ చెబుతారు. ఆయన వల్ల చాలా నేర్చుకున్నా. అంతేకాదు ఆయనతో నెక్ట్స్ సినిమాకి కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా.
కొత్తవారితో నటించేందుకు సిద్ధమే..
కమర్షియల్ సినిమాలంటే హీరో పరిచయం ఓ సాంగ్ , ఫైట్‌తో ఉంటుంది. అలాంటివి వాటితో సంబంధం లేకుండా కూడా సినిమాలు చేయొచ్చని తేజ సార్ నిరూపించారు. పైగా నేను కమర్షియల్ సినిమాలు చేయడం వల్ల నటించేందుకు స్కోప్ లేకుండా పోయింది. అందుకే నా నటనా ప్రతిభని చాటాలని ఈ సినిమా చేశా. ఇటీవల రియాలిటీకి దగ్గరగా, డిఫరెంట్ జోనర్ సినిమాలు వస్తున్నాయి. మనం కూడా కంటెంట్ ప్రధానమైన సినిమాలు చేయాలి. అందుకే రూట్ మార్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నా. సీనియర్ దర్శకులనే కాదు, కొత్త దర్శకులతోనూ సినిమాలు చేయాలనుకుంటున్నా. మంచి కథలు వస్తే కొత్తవారితోనూ చేసేందుకు సిద్ధమే. అయితే కమర్షియల్ సినిమాలు చేయడం తప్పుకాదు. అవి కూడా బాగానే ఆడుతున్నాయి. భిన్నమైన సినిమాల్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. 'సీత'లో అలాంటి అంశాలుంటాయి.
హిందీలో మార్కెట్ పెరిగింది..
ఇకపై సినిమాల విషయంలో తొందర పడాలనుకోవడం లేదు. నెమ్మదిగానే పక్కగా ప్లాన్ చేసుకుని చేస్తాను. ప్రస్తుతం తమిళ రీమేక్ 'రాక్షసన్' సినిమాలో నటిస్తున్నా. ఇటీవల 'కవచం'తో హిందీలో నాకు మంచి మార్కెట్ ఏర్పడింది. హిందీలో బన్నీ సినిమాలు, నా సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి కూడా నచ్చేలా కొన్ని ఎలిమెంట్స్ ఇందులో ప్లాన్ చేస్తున్నాం. జులైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. దీంతోపాటు 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజరు భూపతితో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.